Ys Jagan : పోలీసులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. వడ్డీతో సహా చెల్లిస్తాం

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వైఎస్ జగన్ అన్నారు

Update: 2026-02-04 12:52 GMT

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వైఎస్ జగన్ అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటివద్ద మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చి చెప్పినా ఫ్లెక్సీలు కట్టి విష ప్రచారానికి ఈ కూటమి నేతలు దిగారన్నారు. ఫ్లెక్సీలను తీసేయాలని కోరితే గుడికి వెళ్లి వస్తున్న అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడి చేశారని జగన్ ఆరోపించారు. తనపై దాడు జరుగుతున్న సమయంలో అంబటి రాంబాబు నోరు జారితే.. దాని పర్యవసానంగా ఆయన ఇంటి మీద పడి దాడి చేసి విధ్వంసానికి దిగారన్నారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. అంబటి రాంబాబును స్టేషన్ లో ఉంచి సీఐ, ఎస్ఐలు భౌతికంగా ఇబ్బంది పెట్టారని, తమ ప్రభుత్వం మరో మూడేళ్లలో రావడం ఖాయమని, వచ్చిన తర్వాత ఎక్కడున్నా తీసుకు వచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కూటమి ప్రభుత్వానికి...
కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసులు గుర్తుంచుకోవాలని, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడితే తాము రాష్ట్ర వ్యాప్త బంద్ కు కూడా పిలుపు నిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దాడులు చేస్తే తమ కార్యకర్తలు భయపడేవారు కారని, బంతి కిందకు కొడితే అంత వేగంగా పైకి వస్తుందని గుర్తు చేశారు. సీబీఐ ఛార్జిషీట్ లోనే ఎవరి పేర్లను ప్రస్తావించలేదన్న విషయాన్ని జగన్ తెలిపారు. అయినా తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని జగన్ ఆరోపించారు. గ్లోబెల్స్ ప్రచారంలో భాగంగా చంద్రబాబు కమిటీ వస్తాడట.. సీబీఐ ఇచ్చింది తప్పు.. ఎన్.డి.బి.ఐ ఇచ్చిన నివేదిక తప్పు.. తాము వేసిన సిట్ నిజం అని చెప్పదలచుకున్నారా? అని జగన్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో జంగిల్ రాజ్ ...
రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుందని వైఎస్ జగన్ అన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని తెలిపారు. భయానక వాతావరణాన్ని సృష్టించి కార్యకర్తలను, నేతలను బెదరగొట్టాలని చూస్తున్నారని, మీ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, బ్రహ్మనాయుడు, కాకాణిగోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర నుంచి సంక్షేమ పథకాలను అందకుండా ఉండి ప్రజల్లో అసంతృప్తి తలెత్తుతుందని భావించి పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తన విష ప్రచారానికి వాడుకున్నారని జగన్ ఆరోపించారు. ఇలాంటివి ప్రజలు నమ్మరని అన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చే విధంగా వీరు వ్యవహరిస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.


Tags:    

Similar News