రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో తప్పు ఎవరదంటే?

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వెనక కుట్ర జరిగిందన్న ప్రచారం జరుగుతుంది.

Update: 2026-02-04 07:01 GMT

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వెనక కుట్ర జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. అరవశ్రీధర్ చేసింది తప్పే. వివాహిత మహిళతో సంబంధాన్ని కొనసాగించడాన్ని ఎవరూ అంగీకరించరు. అలాగే మహిళ కూడా ఎమ్మెల్యే కావడంతో అరవ శ్రీధర్ అంటే ఇష్టపడి దగ్గరయ్యారు. అయితే వీరు విడిపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారంపై లైంగిక వేధింపులు రావడంతో జనసేన పార్టీ వెంటనే త్రిసభ్య కమిటీని నియమించింది. నిన్న విచారణ కూడా పూర్తి చేసింది. నివేదిక ఏమిస్తుందన్నది చూడాలి. అయితే అరవ శ్రీధర్ వ్యవహారంలో కొత్త కోణం బయటపడుతుంది. ఎస్సీ యువకుడు కావడంతో కొందరు కావాలనే తమ పట్టు నుంచి జారి పోతారని భావించి ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేశారంటున్నారు.

పోలీసు కేసు కూడా...
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పోలీసు కేసు కూడా నమోదయింది. ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. మరొకవైపు అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిందని ఆరోపణలు కూడా వినిపించాయి. ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసినా అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కూడా ఈ కేసులో దర్యాప్తును వేగంగా కొనసాగించి వాస్తవాలు బయటకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
అగ్రకుల నేతల పెత్తనం...
అయితే సాధారణంగా ఎస్సీ నియోజకవర్గం అంటే అగ్ర కులాల పెత్తనం ఉంటుంది. దాదాపు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అదే పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎస్సీ ఎమ్మెల్యేలపై అగ్రవర్ణాల నేతల పెత్తనం ఎక్కువగా కనపడేది. కొందరు ధైర్యంగా ఎదురుతిరుగుతారు. చాలా మంది ఎమ్మెల్యే పదవి చాలు అని మౌనంగా ఉంటారు. అరవ శ్రీధర్ కు రైల్వే కోడూరులో అసలు పనే లేదట. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అసలు పెత్తనం చేసేది మాత్రం టీడీపీకి చెందిన నేతగా చెబుతున్నారు. అతని కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతుంది. ఇద్దరు కలసి ఉండాలని భావించినా ఆ మహిళ అరవ శ్రీధర్ కు తోడుగా ఉంటే తమ పనులు చెల్లుబాటు కావని భావించి ఇద్దరినీ దూరం చేశారంటున్నారు. తొలి నుంచి అరవ శ్రీధర్ ఆ కుటుంబానికి సేవకుడిగానే ఉంటున్నారన్నది టాక్.
గత ఎన్నికల సమయంలో...
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైల్వే కోడూరు నియోజకవర్గం అభ్యర్థిగా యనమల భాస్కరరావును బహిరంగంగానే ప్రకటించారు. యనమల భాస్కర్ రావు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి కావడంతో అతను ఎమ్మెల్యే అయితే తమ పనులు సాగవని భావించి టీడీపీ నేత ఒకరు చక్రం తిప్పి చివరి నిమిషంలో వైసీపీలో ఉన్న అరవ శ్రీధర్ ను జనసేనలోకి చేర్పించి టిక్కెట్ ఇప్పించారంటున్నారు. అరవ శ్రీధర్ ఏ ప్రారంభోత్సవం, శంకుస్థాపన, ప్రభుత్వ కార్యక్రమాల్లోనైనా నాలుగో స్థానంలోనే ఉంటారని చెబుతున్నారు. ఆ టీడీపీ నేత కుటుంబంలోని ముగ్గురు ముందు వరసలో ఉంటారు. పనిపాటా లేక ఈ యువతికి దగ్గరయ్యారన్నది అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఆ యువతి చదువుకున్నది కావడంతో తమకు ఇబ్బందిగా మారుతుందని భావించి టీడీపీ నేత ఇద్దరినీ దూరం చేయడంతోనే ఈ వివాదం రచ్చకెక్కిందంటున్నారు.


Tags:    

Similar News