Ys Jagan : జగన్ తీసుకున్న నిర్ణయంతో పార్టీకి ఊపు వచ్చేనా?
వైఎస్ జగన్ గత పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారు. పార్టీ నిర్మాణం పై ఆయన ఫోకస్ పెట్టినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలలో ఓటమి పాలయి పదకొండు సీట్లకు పరిమితమయిన నాటి నుంచి జగన్ నోట కార్యకర్తల మాట పదే పదే వినిపిస్తుంది. ఒకరకంగా జగన్‌కు జ్ఞానోదయం అయింది. నియోజకవర్గాల వారీగా నేతలు అనుసరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ త్వరలోనే నియోజకవర్గానికి కార్యకర్తలతో కమిటీలు వేయాలని నిర్ణయించారని తెలిసింది. కార్యకర్తలకు ఇక ఐడి కార్డు, ఇన్స్యూరెన్స్ కల్పించనున్నారు. కార్యకర్తల్లో ఉన్న నిరాశను పారదోలాలంటే కార్యకర్తలను దగ్గరకు తీసుకునే ప్రయత్నాన్ని మొదలు పెట్టారన్నారు.
ఏడాదికి ఒకసారైనా...
వైఎస్ జగన్ ఎప్పుడూ తన బొమ్మతోనే గెలవాలని భావిస్తుంటారు. తన వల్లనే అధికారంలోకి రావాలని కోరుకుంటారు. 2019 ఎన్నికలలో పాదయాత్రతో అది జరిగినా, 2024 ఎన్నికల్లోనూ అదే మైండ్ సెట్ తో వెళ్లడంతో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కార్యకర్తల సమాశాలను జరిపింది లేదు. ప్లీనరీ ఏదో ఒకసారి తప్పించి అసలు నిర్వహించలేదు. క్యాడర్ తో కలవడం, వారితో కలసి భోం చేయడం వంటి పనులకు దూరంగా ఉన్నారు. టీడీపీ మహానాడు నిర్వహించేది కార్కకర్తల్లో ఉత్సాహం నింపడానికే. జెండా పట్టుకునే వారికి కనీసం ఏడాదికి ఒకసారి అయినా పలకరించాలన్న ధ్యాసను జగన్ మర్చిపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడే వారు లేకపోయారు.
ఐదేళ్ల పాటు పార్టీ కార్యాలయాన్ని...
ఇక అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓటమి తర్వాత గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి అర్థమయింది. నేతలు బయటకు రావడం లేదు. ధైర్యంగా వచ్చే కార్యకర్తలు సయితం నిర్లక్ష్యానికి గురి కావడంతో దూరంగా ఉన్నారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్ ఇక కార్యకర్తలకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. పోలింగ్ బూత్ లను కార్యకర్తలతోనే నియమించాలని నిర్ణయించారు. వారికి అన్ని రకాల సదుపాయాలను పార్టీ పరంగా కల్పించాలని డిసైడ్ చేసినట్లు తెలిసింది. ఇక మరొకవైపు అభ్యర్థుల ఎంపికపై కూడా టీడీపీ తరహాలోనే తన నిర్ణయం కాకుండా కార్యకర్తలు, ఐవీఆర్ఎస్ ద్వారా జనాభిప్రాయాన్ని తీసుకోవాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద జగన్ కార్యకర్తలకు చేరువయ్యే ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయన్నది మాత్రం కాలమే సమాధానం చెబుతుంది.