Amaravathi : అమరావతిలో క్రికెట్ స్టేడియం.. ప్రారంభమయితే రూపురేఖలు మారతాయిగా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ స్టేడియం పనులు పూర్తి కావచ్చాయి

Update: 2026-02-04 04:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ స్టేడియం పనులు పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఈ స్టేడియంను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. రాజధానిలో స్పోర్ట్స్ సిటీని డెవలప్‌ చేయడంలో భాగంగా ముందు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియాన్ని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌, బీసీసీఐ కలిసి నిర్మాణ పనులు చేపట్టాయి. రాజధాని ప్రాంతంలోని నవులూరు దగ్గర నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.

ఆధునిక ప్రమాణాలతో...
క్రికెట్ స్టేడియం మొత్తం ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ముప్ఫయి ఐదు వేల మంది కూర్చొని చూసేవిధంగా.. ఆధునిక ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం జరుగుతుంది. ఆంధ్రా విజయవాడ నగరం నుంచి పదమూడు కిలోమీటర్లు.. గుంటూరు నగరం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తే.. అటు విజయవాడ నుంచి.. ఇటు గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చే అవకాశముంది. ఈ ఏడాదిలో నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు.. అంతర్జాతీయ ప్రమాణాలతో పిచ్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే ఈ స్టేడియంను అందుబాటులోకి తీసుకొస్తామని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.
ప్రారంభోత్సవానికి క్రికెట్ స్టార్లు...
అయితే ఈ ఏడాది స్టేడియం పూర్తయి ప్రారంభోత్సవానికి నోచుకున్నప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్ లు మాత్రం వచ్చే ఏడాది జరిగే అవకాశాలున్నాయి. ఇకవచ్చే ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఇక్కడ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ లతో పాటు పలు అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగితే అమరావతి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగుతుందన్న అంచనాల్లో ప్రభుత్వం ఉంది. అందుకే పనులు వేగంగా చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్టేడియం ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి చెందిన, భారత్ క్రికెట్ స్టార్స్ ను పిలవాలన్న యోచనలో ఉన్నారు. ఒక ముహూర్తం చూసుకుని అంతర్జాతీయ మ్యాచ్ లు లేని సమయంలో అయితే వారు అమరావతికి వస్తారని అంచనా వేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే మాజీ క్రికెటర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నారట.



Tags:    

Similar News