నల్లారి ఎంట్రీ రాంగ్ టైమింగా?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతున్నారంటున్నారు.

Update: 2023-04-01 04:26 GMT

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతున్నారంటున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినా ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. త్వరలోనే చేరతారని మాత్రం ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఆయన చేరికతో పార్టీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏదైనా ఉంటుందా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. కేవలం రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకోవడానికి నల్లారి దగ్గర దారి అనుకున్న అధినాయకత్వం ఆయనను పార్టీలోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది. అనిపిస్తుంది. కానీ రెండు రాష్ట్రాల్లో అది సాధ్యం అయ్యే పని కాదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో నష్టమే తప్ప కొత్తగా వచ్చే ఓట్లు కూడా పెద్దగా ఉండబోవన్నది విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా చేసినంత మాత్రాన ప్రజల్లో బలం ఉంటుందా? అంటే నల్లారి గత పదేళ్లుగా ప్రజలకు ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్న వెనువెంటనే వినిపిస్తుంది.


ఏం ఉపయోగం?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకాశించే నేత కాదు. ఆయన నాయకత్వ లక్షణాలు కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితం అని చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పైరవీల కాంగ్రెస్ లో ఆయన అదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి అప్పుడు కూడా కిరణ్ ఎంపిక సరైంది కాదన్నది పార్టీలో అనేక మంది అభిప్రాయం. తన జీవితంలో చూడలేని పదవిని అనుభవించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ ను కష్టాల్లో వదిలేసి వేరే పార్టీ చూసుకోవడంతోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బలం బయటపడింది. ఆయన పీలేరు నియోజకవర్గానికి ఎక్కువ...చిత్తూరు జిల్లాకు తక్కువస్థాయి నేత అన్న సెటైర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
తెలంగాణలో అసలుకే మోసం...
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సేవలను తెలంగాణలోనూ బీజేపీ ఉపయోగించుకోవాలని భావిస్తుందట. అదే జరిగితే అంతకు మించి నష్టం మరొకటి ఉండదు. ఏపీ విభజన సమయంలో నల్లారి వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తెలంగాణలో ఆయన ఎంట్రీతో రెడ్డి సామాజికవర్గం ఓట్లను సంపాదించుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం అంచనా వేసి ఉండవచ్చు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వైపు మాత్రమే తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం మొగ్గు చూపుతుంది తప్ప నల్లారి వైపు కూడా చూడదు. అసలు తమ సామాజికవర్గంగా కూడా ప్రజలు భావించిన పరిస్థితి. అలాంటప్పుడు తెలంగాణలో ఏం ఉపయోగం?

అదనంగా వచ్చే...
ఇక ఏపీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీికి అదనంగా వచ్చే ప్రయోజనం లేదు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓట్లు జగన్ వైపు ఉన్నాయి. అవి టర్న్ అయి నల్లారి వైపు రావడం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం జరగదు. దీర్ఘకాలంలో చెప్పలేం కాని ఇప్పటికిప్పుదు నల్లారి పార్టీలోకి వచ్చినా చేసేదేమీ లేదు. ఏపీలో బీజేపీకి అసలు ఓటు బ్యాంకే లేదు. నల్లారి వల్ల ఓట్లు పెరిగే అవకాశమూ ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన లీడర్ కాదు. అధిష్టానం నిర్ణయించిన నాయకుడు మాత్రమే. అందుకే ఆయన చేరిక బీజేపీకి రెండు రాష్ట్రాల్లో లాభం కాకపోగా, నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ రాంగ్ టైమింగేనన్నది పలువురి అభిప్రాయం.


Tags:    

Similar News