కాంగ్రెస్ క్లిక్ అవుతుందా?
కాంగ్రెస్ పంథా మార్చుకుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తుంది. కర్ణాటకలో చేసిన ఈ ప్రయోగం విజయవంతమయింది
కాంగ్రెస్ తన పంథా మార్చుకుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తుంది. కర్ణాటకలో చేసిన ఈ ప్రయోగం విజయవంతమయిందంటున్నారు. నోటిఫికేషన్ వెలువడక ముందే దాదాపు అరవై శాతం సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. పొత్తుల గురించి ఆలోచించలేదు. సర్వేల ప్రకారం గెలుపు ఆధారంగానే, నమ్మకమైన నేతలకు టిక్కెట్లను హైకమాండ్ ప్రకటించింది. రాహుల్ గాంధీ గతంలో ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ కనుక. కానీ రాహుల్ గట్టిగా పట్టుబట్టినందుకో.. మరే కారణమో తెలియదు కన్నడ నాట ఇతర పార్టీల కంటే అభ్యర్థుల ప్రకటించడంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
కర్ణాటకలో ముందుగానే...
గెలుపుపై కూడా అక్కడ కాంగ్రెస్‌కు సానుకూల సర్వేలు వెలువడుతున్నాయి. కర్ణాటకలో ఎన్నికల అనంతరం పొత్తులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగానే ప్రకటించారని కొందరు అంటున్న మాటలను పక్కన పెడితే రాహుల్ తన మాటను కన్నడ నాట నిలబెట్టుకున్నారు. తెలంగాణలోనూ అదే విధానాన్ని అవలంబిస్తారా? అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా పొత్తుల పట్ల పెద్దగా పార్టీ నేతలకు ఆసక్తి లేదు. ఒంటరిగానే పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కమ్యునిస్టులు గులాబీ పార్టీ పంచన చేరడంతో ఇక వాటి గురించి ఆలోచించే పని కూడా కాంగ్రెస్ కు లేకుండా పోయింది. ఇప్పటికే సునీల్ కనుగోలు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేస్తుందంటున్నారు.
ఇక్కడ కూడా సర్వేలు...
119 నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించి త్వరలోనే అభ్యర్థుల జాబితాతో నివేదికను సునీల్ టీం హైకమాండ్‌కు ఇస్తారంటున్నారు. అదే జరిగితే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను తెలంగాణలోనూ ప్రకటిస్తారా? లేదా కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ప్రకటించి తర్వాత జాబితా కొద్ది రోజుల తర్వాత విడుదల చేస్తారా? అన్నది చూడాలి. ఇక్కడి రాష్ట్ర నేతల కోరిక కూడా అదే. ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు పదే పదే కోరుతున్నారు. తెలంగాణలోనూ శాసనసభ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే ఉంది. అంటే మరో రెండు మూడు నెలల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కనీసం ప్రధానమైన నియోజకవర్గాల్లోనైనా అభ్యర్థులను ప్రకటించాలని ఇక్కడి నేతలు కోరుతున్నారు.
ముందుగానే ప్రకటిస్తే...
ముందుగానే ప్రకటించినందున అనేక లాభాలున్నాయి. ఒకటి అభ్యర్థులు ఇతర పార్టీల అభ్యర్థులకంటే ముందుగా జనంలోకి వెళ్లే వీలుంటుంది. ఓటర్లను ఎక్కువ సార్లు నేరుగా కలుసుకునే సమయం చిక్కుతుంది. ఆర్థికంగా కొంత నిధులు సమకూర్చుకునే వీలు కూడా దొరుకుతుంది. వీలయినన్ని ఎక్కువ సార్లు ప్రజలను కలిస్తే వారికి కాంగ్రెస్ అభ్యర్థుల పట్ల సానుభూతి లభిస్తుందన్న అంచనా కూడా వేస్తున్నారు. ఎవరైనా అసంతృప్త నేతలున్నా బుజ్జగించే సమయం దొరుకుతుంది. ఇలా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటంతో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని ఇక్కడి నేతలు కూడా కోరుతున్నారు. రాహుల్ గాంధీ కూడా అదే చెప్పి వెళ్లారు. మరి కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ అదే మాదిరి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తుందా? లేదా? అన్నది చూడాలి.