2000 ఎందుకో వారికి కూడా తెలియదంట!

Update: 2016-11-16 05:30 GMT

పెద్దనోట్లను ప్రస్తుతం ఉన్నవాటిని చెలామణీలోంచి తీసేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ప్రకటించారు. 1000 రూపాయల నోట్లు స్థానే 2000 రూపాయల నోటును కొత్తగా ప్రవేశ పెడుతున్నట్టు కూడా అదే రోజున చెప్పారు. ఈ నిర్ణయం చాలా కీలకమైనది కనుక.. సుమారు 8-10 నెలలుగా దీని మీద కసరత్తు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మోదీ ఎవ్వరికీ సూచనప్రాయంగా కూడా తెలియజెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఒక ప్రచారం జరిగింది.

అయితే నిర్ణయం వెలువరించిన తర్వాత కూడా.. సదరు నిర్ణయం మీద.. సామాన్య ప్రజలకు సవాలక్ష సందేహాలు ఉండడం సరే.. కనీసం మోదీ మంత్రివర్గ సహచరులకు కూడా క్లారిటీ లేకపోవడం మాత్రం చిత్రమైన అంశమే. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా.. తెదేపాకు చెందిన కేంద్రమంత్రులు మాట్లాడిన మాటలను గమనిస్తే.. మోదీ నిర్ణయంలో ఒక కీలకాంశం అయిన 2000 రూపాయల నోటు అనే దానిపై సాక్షాత్తూ మంత్రులకే ఇంకా క్లారిటీ లేదని తెలుస్తున్నది.

నిజానికి చంద్రబాబునాయుడు అసలు నల్లధనాన్ని పూర్తిగా కట్టడి చేయాలంటే.. 500, 1000 రూపాయల నోట్లను పూర్తిగా నిషేధించాలని గతంలో మోదీకి లేఖ రాశారు. దేశంలో మూడేళ్లకు పైబడి సాగుతున్న అర్థ క్రాంతి ఉద్యమం కోరుతున్నది కూడా అదే. అన్నాహజారే, రామోజీరావు వంటి వారు కూడా పలు సందర్భాల్లో మోదీకి నివేదించింది అదే. అయితే మోదీ తీసుకున్న నిర్ణయం ఆరంభంలో.. పెద్ద నోట్ల నిషేధం లాగా కనిపించింది గానీ.. వాస్తవంలో అది నోట్ల మార్పిడి మాత్రమే. పైగా నల్లధనం నిల్వ చేసుకోవడానికి మరింత సౌకర్యం కల్పిస్తున్నట్లుగా 2000 నోటును ఆచరణలోకి తేవడంతో చాలా మంది విస్తుపోయారు.

ప్రధాని 8వ తేదీన ఈ నిర్ణయం వెలువరించిన తర్వాత.. రెండుసార్ల కేంద్ర కేబినెట్ భేటీ జరిగినప్పటికీ.. ఆయన కనీసం కేబినెట్ సహచరులకు కూడా ఏమీ వివరణ ఇచ్చినట్లు లేదు. మోదీ 2000 నోటును ఎందుకు తెచ్చారో అర్థం కావడం లేదని మంత్రి అశోక్ గజపతి రాజు ఇవాళ కూడా చెబుతున్నారు. ఆ విషయం తెలుసుకోవాల్సి ఉందని ఆయన అంటున్నారు. చూడబోతే.. మోదీ తన నిర్ణయాల పట్ల కనీసం కేబినెట్ సహచరుల అభిప్రాయాలు తీసుకోవడం సంగతి తరువాత, కనీసం వారికి అవగాహన ఉండేలాగా కూడా పట్టించుకోవడం లేదని అనిపిస్తోంది.

కేంద్ర మంత్రులుగా ఉన్నవారే ‘ఏం జరుగుతోందో తెలియదని’ అంటే.. హాస్యాస్పదంగా ఉంటుందని మోదీ సర్కారు గుర్తించాలి.

Similar News