మల్లా రాజి రెడ్డి: ఆయన్ను పట్టిస్తే కోటి రూపాయలు
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.
1975లో ఇంటర్ చదువుతున్న సమయంలో ఆర్‌ఎస్‌యూ(RSU)లో చేరారు. అప్పుడే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు. వివాహమై ఒక కూతురు జన్మించిన తర్వాత 1977లో అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. మంథని, మహదేవ్‌పూర్ ఏరియా దళంలో పని చేసి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 1977లో ఆయనను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బెయిల్‌పై వచ్చాక ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్రకు వెళ్లి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1986లో పూర్వ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పోలీస్స్టేషన్‌పై దాడి జరిపి ఒక ఎస్‌ఐ, 12 మంది పోలీసులను కాల్చి చంపారు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మెరుపుదాడి జరిపి 16 మంది పోలీసులను హతమార్చారు. 1996-97లో ఆయనను పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకుంది. ఆయనపై కోటి రూపాయల నజరానా కూడా ఉంది.