Weather Report : ఊపిరి తీస్తున చలి.. ఇంకా ఎంతకాలమంటే?

ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రెండు తెలుగు రాష్ట్రాలు వణికి పోతున్నాయి.

Update: 2025-12-17 04:05 GMT

ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రెండు తెలుగు రాష్ట్రాలు వణికి పోతున్నాయి. ఈ గాలుల వల్లనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక జిల్లాలు చలిగాలుల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. చిగురాటుకలా ప్రజలు వణికిపోతున్నారు. ఇంత కనిష్ట స్థాయిలో చలిగాలుల తీవ్రత ఎప్పుడూ లేదని చెబుతున్నారు. పదేళ్ల తర్వాత ఇంత కనిష్టస్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఇక వాహనదారులు కూడా ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కారణంగా ప్రయాణం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరో మూడు రోజులు ఏపీలో...
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. ఏపీలో చలితీవ్రత పెరగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు తక్కువని మరొకవైపు అధికారులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే నాలుగు డిగ్రీల వరకూ పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, అయితే చలిగాలుల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఎక్కువగా ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లో ఎక్కువగా...
తెలంగాణలో చలి ప్రభావం మామూలుగా లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా చలి ఊపిరితీస్తుంది. దుప్పటి ముసుగేసుకున్నా చలిగాలులు వదలకుండా వెంట పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ప్రధానంగా హైదరాబాద్, నిర్మల్,వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు.


Tags:    

Similar News