Telangana : తెలంగాణలో లబ్దిదారులకు షాకింగ్ న్యూస్.. నో ఛాన్స్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఇందిరమ్మ ఇళ్లు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఇందిరమ్మ ఇళ్లు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంపికయిన లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్నిచేపట్టారు. అయితే ప్రభుత్వం మరింత వేగంగా ఈ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో అత్యధిక భాగం శ్లాబ్ వరకూ వచ్చాయి. కొన్ని బేస్ మెంట్ లోనే ఆగిపోయాయి. మరికొన్ని గోడలు లేచాయి. అయితే ఇందుకు ప్రధాన కారణం గుర్తించిన ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. లబ్దిదారులు ఇంటి నిర్మాణ పనులను పక్కన పెట్టి ఉపాధి కోసం వేరే పనులకు వెళుతుండటంతో నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయని గుర్తించింది.
జాబ్ కార్డు ఉంటేనే...
అందుకోసమే ఫిట్టింగ్ పెట్టింది. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఒక్కొక్కఇందిరమ్మ ఇంటినిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందిస్తుంది. విడతల వారీగా నగదును లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది. వివిధ దశల్లో నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మాత్రమే నగదును వారి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే తాజాగా మరొక కొత్త నిబంధన అమలులోకి తెచ్చింది. ఐదు లక్షల రూపాయల్లో 4.40 లక్షల రూపాయలు దశల వారీగా నగదును లబ్డిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ మిగిలిన అరవై వేలు పొందాలంటే ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం, కూలీల వేతనం కింద చెల్లించనున్నారు. ఈ మొత్తానికి మాత్రం లబ్దిదారుడడు ఖచ్చితంగా జాబ్ కార్డు ఉండాల్సిందే.
ప్రభుత్వం నుంచి క్లారిటీ...
అంటే ఇంటిని పొందిన లబ్దిదారుడు ఖచ్చితంగా ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాల్సిందే. అంటే వారి ఇంటి నిర్మాణాలకు కూలీ పని వారే చేయాల్సి ఉంది. అప్పుడే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే తెలంగాణలో సంవత్సరం కాలంగా కొత్త జాబ్ కార్డులు మంజూరు కాకపోవడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త జాబ్ కార్డుల కోసం అనేక దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇంటి లబ్దిదారుల్లో ఎవరికి జాబ్ కార్డు ఉన్నప్పటికీ ఆ ఇంటి యజమాని పేరును కూలీగా చేర్చి అరవై వేల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని అంటున్నారు.మరి దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.