న్యూస్ పేపర్ బాయ్ నుంచి డైలీ ఎడిటర్ దాకా .. యం యస్ ఆచార్య
ఎడిటర్లు లేరు, మనకు ప్రొప్రయిటర్లే మిగిలారు: పాశం యాదగిరి
మాడభూషి శ్రీధర్ రచించిన ‘‘న్యూస్ పేపర్ బాయ్ నుంచి డైలీ ఎడిటర్ దాకా .. యం యస్ ఆచార్య’’ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టులు 38వ హైదరాబాద్ పుస్తక ఫెయిర్ ప్రదర్శనలో (కొంపెల్లి వెంకట్ గౌడ్ వేదిక) డిసెంబర్ 22 సాయంత్రం ఆవిష్కరించారు. హైదరాబాద్ జర్నలిస్టులు ప్రముఖ పాత్రికేయుడు జనధర్మ వరంగల్ వాణి పత్రికల వ్యవస్థాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కీర్తిశేషులు యం యస్ ఆచార్య శతజయంతి సందర్భంగా విగ్రహాన్ని నిర్మించడం సరయిన నివాళి అని వక్తలు అన్నారు. ప్రసిద్ధ సంపాదకీయులు తదితర జర్నలిస్టులు కె రామచంద్రమూర్తి, ఉదయం మాజీ చీఫ్ రిపోర్టర్ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మాజీ ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె శ్రీనివాస్, ఎమెస్కో సంపాదకులు జి వల్లీశ్వర్, సుందర విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు ఎస్ వినయ్ కుమార్, జర్నలిస్టుల సోసైటీ అధ్యక్షుడు శ్రీ బ్రహ్మాండభేరి గోపరాజు, మహాత్మా జ్యోతీపూలే MJPTBCWREI Society సంస్థ జాయంట్ సెక్రటరీ ప్రభుత్వ అధికారి జివి శ్యామ్ ప్రసాద్ లాల్, సభానిర్వహకులు పొన్నం రవిచంద్ర జర్నలిస్టు, ఫిల్మ్ క్రిటిక్ అందరూ కలిసి పుస్తకం విడుదల చేసారు. ఇంకా చాలా మంది ప్రముఖులు సమయం దొరకక, దూరంగా ఉండడం వల్ల రాలేకపోయారు. శ్రీధర్ బావగారు కొవెల గోపాల్, జర్నలిస్టుల నాయకుడు, మనతెలంగాణ సంపాదకుడు డి అమర్ లకు ఆచార్య పుస్తకాన్ని స్వీకరించారు.
వరంగల్ లో యం యస్ ఆచార్య ఉచిత వైద్యశాల
10 లక్షల రూపాయలతో మాడభూషి శ్రీధర్ నిర్మించిన వరంగల్లు గొర్రెకుంట ఆశ్రమంలో వృధ్దాశ్రయంవారికి ఉచిత వైద్యశాలను ఏడాదికిందట ప్రారంభించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ యం యస్ ఆచార్య స్మారక ప్రసంగాలను నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్లు ఎం రాజగోపాలాచార్య, మాడభూషి శ్రీధర్ లకు బంగారు పతకాలు ఇచ్చిన కాకతీయ యూనివర్సిటీ, ఆ ఇద్దరు ప్రొఫెసర్లు కలిసి యం యస్ ఆచార్య గోల్డ్ మెడల్’’ ను యూనివర్సిటీ నెలకొల్పినట్టు అధికారికంగా ప్రకటించింది.
నిజాం రాజ్యంలో లో పత్రికలను పంచడమే ఒక సాహసం- కె రామచంద్రమూర్తి
యం యస్ ఆచార్య జీవిత గాధ వంటిది కథ కాదు. చాలా కష్టమైన జీవనం. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారు, పత్రికలను పంచడమే ఒక సాహసమయ్యే దశలో ప్రతి ఉదయం పత్రికను ఇంటింటికీ పంచే వృత్తి నిర్వహిస్తూ, నిజాం పోలీసులతో పోరాడే పరిస్థితి ఉండిందని ప్రసిద్ధ జర్నలిస్టు, సంపాదకుడు శ్రీ కె రామచంద్రమూర్తి అన్నారు.
ఎన్నో వృత్తి పోరాటాలను అనుభవించిన తరువాత పేపర్ బాయ్ నుంచి ప్రారంభించి, పత్రికల ఏజెంట్ గా సైకిల్ పై వరంగల్లు ప్రతిగల్లీని తిరుగుతూ పత్రికల చందాలను వసూలు చేసుకోవడం పెద్ద సమస్య. అప్పుడు పోలీసులతో సమస్యలు ఇంకా పెద్దవి. తరువాత విలేకరిగా పనిచేయడం కష్టమనుకుంటే జనధర్మ వార పత్రికను ఆ తరువాత దినపత్రిక వరంగల్ వాణిని నడపడం ఊహించడమే సమస్య. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక విలేకరిగా పనిచేయడం ఇంకా మరో సాహసం అయింది. వరంగల్లులో స్వయంగా కలిసిన జ్ఞాపకాలను మూర్తిగారు వివరించారు. ‘‘న్యూస్ పేపర్ బాయ్ నుంచి డైలీ ఎడిటర్ దాకా..యం యస్ ఆచార్య’’ పుస్తకం ఒక జర్నలిస్టుగా అంతముందు నిజాంపైన స్వాతంత్ర్య పోరాటం నిర్వహించిన ఘట్టాలను వివరించారని వివరించారు. ఎమెస్కో ప్రచురించే ముందు ఎడిటింగ్ చేసేదశలోనే తాను మొత్తం పుస్తకాన్ని చదవారని, చాలా ఆసక్తిదాయకంగా ఆశ్చర్యమైన ఘట్టాలను గుర్తు చేసారనీ మూర్తిగారు వివరించారు.
ఒక నిబద్ధత కలిగిన జర్నలిస్టు, ఆచార్య: ఎమెస్కో జి వల్లీశ్వర్
ప్రముఖ జర్నలిస్టు, ప్రస్తుతం ఎమెస్కో ఎడిటర్, రచయిత, జి వల్లీశ్వర్ తమ ఏలూరు టైమ్స్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ యం యస్ ఆచార్య, వారి కుమారుడు శ్రీధర్ కీ తనకు పోలికలు ఉన్నాయని చెప్పారు. ‘ ఇదివరకు సమాజంలో పనిచేసే జర్నలిస్టు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు కేవలం నటిస్తున్నారు.’’ అని విమర్శించారు. తను హై స్కూల్ నాటి మాగజైన్ ప్రచురణ అంశాలను వివరించారు.
ఆంధ్రపత్రిక విలేకరిగా పనిచేసి, స్థానిక జనధర్మ వరంగల్ వాణి నడిపినట్టే, తాను కూడా ఏలూరు టైమ్స్ విలేకరిగా ఢంకా పత్రిక విలేకరిగా పనిచేసారని చెప్పారు. నిజాం వ్యతిరేక కాలంలో డాక్టర్ గారి బందువులు చాలా కష్టాలు పడ్డారన్నారు. ఆచార్య గారు ఒక నిబద్ధత కలిగిన ఆయన వరంగల్ నుంచి 'జనధర్మ' పత్రికను నడుపుతున్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో పత్రికా నిర్వహణ అంటే అది ఒక తపస్సు లాంటిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా ఆయన ఎప్పుడూ తన కలం పోటును తగ్గించలేదు. అక్షరమే ఆయుధంగా ఆయన పోరాటం చేశారని చెప్పారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, తన వృత్తి ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా పత్రికలతో కలంతో ఆచార్య గారు సంచలనం చేసారు. నిజం పోలీసుల దాడులు ఉన్నా సరే, తన ధైర్యంవదలకుండా, కసి గా పనిచేస్తూ కలం వదల లేదని అన్నారు. గాంధీ ఉద్యమంలో పాల్గొన్నవారేనని, రహస్య కార్యక్రమాలు చేసేవారని, తెలంగాణ లో నిరంతరం పోరాటమే సాగిందనీ, రజాకార్ కాలంలో వేలాది మంది బాధితులున్నారని అన్నారు. ఇక ఆచార్యగారి కుమారుడు మాడభూషి శ్రీధర్ కూడా ఉదయం పత్రికలో ఒక సంచలనం చేసినవారేననీ, టిటిడిలో శ్రీధర్ రచనలు ఒక వ్యక్తిగాగొప్ప కదలిక సృష్టించారనీ అంటూ ఆచార్య గారి వారసత్వాన్ని కేవలం జర్నలిజంలోనే కాదు, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అధికారాన్ని అందించడంలో కూడా కొనసాగిస్తున్నారనీ ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవనీ తండ్రి గారు పత్రిక ద్వారా సమాజాన్ని జాగృతం చేస్తే, కుమారుడు చట్టం ద్వారా వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారనీ అన్నారు. ఈ సభలో ఆచార్య గారి జీవిత విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా అభినందించదగ్గ విషయం. ఇది రాబోయే తరం జర్నలిస్టులకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆచార్య గారికి నివాళులర్పించే అవకాశం వచ్చిందన్నారు.
సుందర విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు ఎస్ వినయ్ కుమార్ నివాళి
ప్రముఖ జర్నలిస్టు ఎస్ వినయ్ కుమార్ ప్రసంగిస్తూ ‘‘అది వ్యక్తిగతమైనటువంటి జీవితంగా ఉండదు. ఈ పుస్తకంలో కూడా మనకు అదే కనపడుతుంది. మొత్తం ఆరోజు ఉన్నటువంటి పోరాటాల చరిత్ర అంతా ఈ పుస్తకంలో ఉంటుంది. ఆయన కేవలం జర్నలిస్టు కాదు, పోరాట వీరుడు కూడా. ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అంటే ఆయుధం పట్టలేదు కానీ, ఆయుధం చేపట్టినటువంటి వాళ్లకు రక్షణ కల్పించడం, వాళ్ళని దాచిపెట్టడం, వాళ్ళు బయటికి వెళ్ళేటట్లు చేయడం, రజాకార్ల దాడి నుంచి తప్పించుకుని వెళ్ళేటట్లు చేయడం ఇటువంటివన్నీ కూడా ఆయన చేశారన్నారు.
‘‘కానీ ఒక విషయం చాలా విచిత్రంగా అనిపించేది ఏంటంటే, 25 పత్రికలు వచ్చే వరంగల్ లో ఆంధ్ర పత్రిక సర్క్యులేషన్ ని 1200 కు ఎట్లా పెంచారు? అది కూడా ఆంధ్ర పత్రిక. అది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 1200 కు పెంచడమే కాకుండా 1200 పత్రికలను ఆయనే సైకిల్ మీద తీసుకెళ్లి వేసేవారు. ఆ తర్వాత ఆయన రిపోర్టింగ్ కూడా చేశారు, సొంతంగా పత్రిక పెట్టారు జనధర్మ. ఆ తర్వాత అది వరంగల్ వాణి గా మారింది’’ అని వివరించారు.
వినయ్ కుమార్ గారు ఈ పుస్తకంలో ఒక సంఘటన గురించి వివరిస్తూ...‘‘అది వరంగల్ లో గాంధీజీ కి సంబంధించిన ఇన్సిడెంట్. గాంధీజీ ఇన్సిడెంట్ ఈయన్ని జర్నలిస్టుగా కావడానికి చాలా పురికొల్పింది అని అనిపిస్తుంది. ఆ ఇన్సిడెంట్ ఏ ఇంకొక మహత్తర జర్నలిస్టును సృష్టించింది, ఆయన పేరే షోయబుల్లా ఖాన్. ఆయన కూడా వరంగల్ స్టేషన్ లో వాళ్ళ తండ్రిగారు పనిచేసేవారు, గాంధీజీని చూడడానికి అక్కడికి వెళ్ళాడు. తర్వాత ఆయన స్వాతంత్ర పోరాటంలో, రజాకార్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఒక పత్రికను ప్రారంభించారు. ఆయనకు స్ఫూర్తి ఆ వరంగల్ స్టేషన్ లోనే ఆయనకు కూడా స్ఫూర్తి లభించింది. ఆచార్య గారికి లభించినట్టుగానే కనపడుతుంది ఆయనకు కూడా’’ అన్నారు. రచయిత శ్రీధర్ చాలా సంచలనం కలిగించినటువంటి వార్తలు తిరుపతి మీద, చాలా అథారిటీ తో ఇచ్చినటువంటి స్టోరీ రాసారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారు కూడా దాన్ని అంత సీరియస్ గా తీసుకుని హైకోర్టు జడ్జి కమిషన్ నియమించారన్నారు. జర్నలిస్టు గానే కాకుండా శ్రీధర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా కూడా సంచలనం చేసారు. అదేంటంటే పెద్దల ప్రభువుల డిగ్రీ సర్టిఫికేట్ చూపెట్టాలి, దాన్ని మొత్తం ప్రజలకు వెల్లడించాలి అని తీర్పు ఇచ్చారు. ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఈ సర్టిఫికేట్లు పెట్టమని ఆర్డర్ చేయడం అది వరకు ఎవరైనా చేశారో లేదో కానీ, ఆ క్రెడిట్ అంతా కూడా మనకు శ్రీధర్ గారికి దక్కుతుంది. స్మృతి ఇరానీ సర్టిఫికేట్లు కూడా. అది చాలా సాహసం కావాలి, ఎంత ధైర్య సాహసం కావాలి. మనం చూస్తున్నాం కదా సుప్రీం కోర్టులో జడ్జిమెంట్స్ ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు కావడమో, ఇంకో కమిషన్ కు చైర్మన్ కావడమో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్ ని సర్టిఫికేట్లు సబ్మిట్ చేయమని ఆదేశించడం అంటే సాధారణమైన విషయం కాదు అంటూ, ఇటువంటి ఘట్టాలతో శ్రీధర్ కూడా మీ ఆత్మకథ రాయాలన్నారు.
సినీ విమర్శ పాత్రికేయుడు, పొన్నం రవిచంద్ర
ముఖ్యంగా మన శ్రీధర్ గారు ఆచార్య గారి వారసత్వాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక కొడుకుగా కాకుండా ఒక శిష్యుడిగా, ఒక జర్నలిస్ట్ గా ఆయన తండ్రి ఆశయాలను గౌరవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. సమాచార హక్కు చట్టం ద్వారా శ్రీధర్ గారు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది వారి నాన్నగారి నుంచి వచ్చిన ఆ తెగువ, ఆ నిబద్ధత అని నేను భావిస్తున్నానని ఈ సభాకార్యక్రమాలను నిర్వహించిన పాత్రికేయుడు, రచయిత పొన్నం రవిచంద్ర వివరించారు. ఈ పుస్తకం ఆచార్య గారి జీవితాన్ని మాత్రమే కాదు, ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది అన్నారు.
ఒక సమున్నతమైన వ్యక్తి: జివి శ్యామ్ ప్రసాద్ లాల్
"ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆచార్య గారి గురించి ఈరోజు మనం ఎన్నో విషయాలు గుర్తుచేసుకున్నాం. ఒక సాధారణ జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, అసాధారణమైన వ్యక్తిత్వంతో ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. మహాత్మా జ్యోతీపూలే MJPTBCWREI Society సంస్థ జాయంట్ సెక్రటరీ ప్రభుత్వ అధికారి జివి శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.
"పత్రికా రంగంలో ఎం.ఎస్. ఆచార్య గారు ఒక సమున్నతమైన వ్యక్తి అని మనందరికీ తెలిసిందే. ఆయన పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన నిబద్ధత, ఆయన విలువలు. ఆచార్య గారు పనిచేసిన కాలంలో జర్నలిజం అంటే ఒక మిషన్ లాగా ఉండేది. ఈ రోజుల్లో జర్నలిజం వ్యాపారంగా మారుతున్న తరుణంలో, ఆచార్య గారి లాంటి వ్యక్తుల గురించి చర్చించుకోవడం చాలా అవసరం. ఆయన కేవలం వార్తలు రాయడమే కాదు, సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండేవారు. వరంగల్ కేంద్రంగా ఆయన చేసిన పత్రికా ప్రస్థానం చిరస్మరణీయం. తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు ఆయన కలం ఎప్పుడూ ముందుండేదని రవిచంద్ర, తదితర వక్తలు వివరించారు.
ఇక శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆర్టీఐ (RTI) కమిషనర్‌గా ఆయన తీసుకున్న తీర్పులు నిర్ణయాలు సంచలనం సృష్టించాయి, ముఖ్యంగా పారదర్శకత కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. అవి కేవలం తీర్పులు మాత్రమే కాదు, సమాచార హక్కు చట్టం యొక్క శక్తిని దేశానికి చాటిచెప్పిన సందర్భం అని అన్నారు.
ఆచార్య గారి జ్ఞాపకార్థం ఈ రోజు ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, వారి సేవలను గుర్తుచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జర్నలిజం విలువలు కాపాడటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఎందరికో స్ఫూర్తి: ప్రముఖ జర్నలిస్టు శ్రీనివాస్
ఎం.ఎస్. ఆచార్య గారి పేరు పాత్రికేయులందరికీ, తెలంగాణ వాళ్ళందరికీ సుపరిచితమైన పేరు - జనధర్మ, వరంగల్ వాణి. మన పాత్రికేయ చరిత్రలో పెద్ద పత్రికలు లేదా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వాళ్ళ సంపాదకులు అటువంటి వాళ్ళ గురించిన ప్రముఖంగా వింటుంటాం కానీ నిజానికి తెలంగాణలో జర్నలిజానికి ఇప్పుడు జిల్లా కేంద్రాలని చెప్తున్న వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఇటువంటి ప్రాంతం నుంచే పాదులు పడ్డాయని ప్రసిద్ధ సంపాదకుడు, మాజీ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ అన్నారు. ‘‘చాలా గొప్ప జర్నలిజంను చాలా వరంగల్ లాంటి సాంస్కృతిక కేంద్రంలో, రెండవ రాజధాని తెలంగాణకు అని చెప్పిన కేంద్రంలో, పాత్రికేయాన్ని నిర్వహించినవాళ్ళు ఆచార్య గారు. వారి నుంచి స్ఫూర్తి పొందాల్సింది, తర్వాత కూడా మన తెలంగాణలో జనధర్మ తర్వాత కాకతీయ లాంటి పత్రికలు, తర్వాత కరీంనగర్ లో జీవగడ్డ ఇటువంటి పత్రికలు చాలా పెద్ద పాత్ర పోషించాయి. మన చరిత్ర రచనలో దీనికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఎం.ఎస్. ఆచార్య గారు తెలుగు పాత్రికేయ రంగంలోనూ, తెలంగాణ పత్రికేయ రంగంలోనూ ఒక దిగ్గజం. వారిని స్మరించుకోవడానికి జర్నలిస్ట్ కాలనీలో విగ్రహం పెడుతున్నందుకు సొసైటీ వారిని అభినందిస్తున్నాను ఇది సాధ్యం చేసినందుకు. అదేవిధంగా ఆచార్య గారికి నివాళులర్పిస్తున్నానని అన్నారు.
మనకు ప్రొప్రయిటర్లే మిగిలారు: పాశం యాదగిరి
సీనియర్ జర్నలిస్టు ఉదయం మాజీ ఛీఫ్ రిపోర్టర్ పాశం యాదగిరి ఆచార్య ఆదర్శ పాత్రికేయుడని జోహార్లు అర్పించారు. 1988లో వరంగల్లులో ఆచార్య షష్టిపూర్తి సందర్భంగా అభినందన సభలో ప్రత్యేక వ్యాసం రాస్తూ ‘‘ఆచార్యగారు పుట్టడం వరంగల్లు అదృష్టం, కాని ఆచార్య ఇతరులకు తెలియకపోవడం దురదృష్టం’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాసాన్ని చదివి చాలా బాగా చెప్పారని యం యస్ ఆచార్య ప్రశంసించారు. అనే సందర్భాలలో కూడా యాదగిరి ఈ వ్యాఖ్యను ఉటంకించారు. ప్రముఖ జర్నలిస్టు ఎం చలపతి వ్యాఖ్యను ప్రస్తావిస్తూ అసలు పత్రికలలో ఎడిటోరియల్ ఉండే రోజులు పోయాయి. కేవలం మనకు ప్రొప్రయిటర్లే మాత్రమే ఎడిటోరియల్ గురించి రాస్తున్నారు అని ఈ నాటి జర్నలిజంను యాదగిరి విమర్శించారు.
"ఆచార్య గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. వారు జర్నలిజంలో సృష్టించిన విలువలు, పంథా రాబోయే తరాలకు ఒక పాఠ్యపుస్తకం లాంటిది. ఆయన పత్రిక నడపడంలో ఉన్న కష్టనష్టాలను ఓర్చుకుని, ఎప్పుడూ కూడా యాజమాన్యాల ఒత్తిడికి లొంగకుండా, ప్రజల పక్షాన నిలబడ్డారు. ఆ రోజుల్లో వరంగల్ నుంచి ఒక పత్రికను నడపడం, దాన్ని విస్తరించడం అంటే అది కేవలం సాహసమే కాదు, అంకితభావం అంటూ పత్రికలు నడపడంలో చాలా కష్టాలుంటాయి, ఆచార్య గారు వరంగల్ వాణిలో, జనధర్మ నిర్వహణలో ఆయన కష్టాలు మాకు తెలుసు. మేం హైదరాబాద్ లో వర్తమానం పత్రిక నిర్వహణలో భరించకతప్పలేదని అన్నారు.
ఆచార్య విగ్రహం నిర్మాణం: గోపరాజు బ్రహ్మాండభేరి:
జర్నలిస్టుల సహకార సొసైటీ అధ్యక్షుడు శ్రీ గోపరాజు బ్రహ్మాండభేరి ప్రసంగిస్తూ ఢిల్లీ లో సిఐసి కార్యాలయంలో సెకండ్ అప్పీల్ లో విచారణను గుర్తు చేస్తూ యం యస్ ఆచార్య విగ్రహ నిర్మాణానికి శ్రీధర్ కోరారని, దానికి ఒక్కరినే ఒప్పుకుంటే సరిపోదని అన్నారనీ, మొత్తం వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ ఏకగ్రీవంగా తీర్మానం ద్వారా అంగీకరించారనీ అన్నారు. ఆరడుగల విగ్రహం కూర్చుని పేపర్ చదువుకుంటున్నభంగిమలో నిర్మాణం పూర్తయిందని తరువాత కార్యక్రమాలను ప్రయత్నాలను సాగుతున్నాయని, త్వరగా విజయవంతంగా ముగిస్తామని అన్నారు.
అక్షరం అమ్ముకోరాదు: నేటి నిజం ఎడిటర్ బైస దేవదాస్ దాదాపు పైగా 40 సంవత్సరాలనుంచి తనకు పరిచయం ఉందంటూ నేటి నిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైస దేవదాస్ వరంగల్ లో జనధర్మ పత్రిక కార్యాలయాని వచ్చి, కేకలు వార పత్రికగురించి పరిచయం చేసి, నిజామాబాద్ లో పత్రికనడిపే ధైర్యాన్ని ప్రోత్సహాన్ని ఇచ్చారని వివరించారు. ప్రభుత్వ అధికారులు, ప్రకటనలను ప్రచురించే తేదీ తరువాత వరంగల్లు పంపడం అన్యాయమనీ, ఆ బిల్లుకు పైసలు తీసుకోవడం న్యాయం కాదు కనుక దయచేసి ప్రకటన కొన్ని రోజుల ముందే ఇవ్వాలని ఆచార్య అనేవారు. కఠినంగానే చెప్పేవారు. ఏదో రకంగా ప్రచురించండి, డబ్బు కోల్పోకండి అనే ధోరణిని విమర్శించేవారు ఆచార్య అని దేవదాస్ గారు చెప్పారు. ఆయన జనధర్మలో రాసిన వార్తలు చలనం కలగాయనీ, ఆయన అక్షరాలు ఆలోచింప చేసేవారని అన్నారు.
శ్రీ బైస దేవదాస్ "ఆచార్య ఎప్పుడూ కూడా విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. వార్తల్లో నిజాయితీ ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి’’ అన్నారు. ఆయన రాసిన సంపాదకీయాలు అప్పట్లో ఎంతో ప్రభావం చూపేవి. ముఖ్యంగా సామాన్యుల గొంతుకగా ఆయన పత్రిక నిలబడింది. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు, 'అక్షరం అనేది అమ్ముడుపోయే వస్తువు కాకూడదు, అది సమాజ చైతన్యానికి ఉపయోగపడే ఆయుధం కావాలి' అని. ఈరోజు ఆచార్య గారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అదే. నేటి యువ జర్నలిస్టులు, ముఖ్యంగా ఈ కాలంలో వస్తున్న మార్పుల మధ్య తమ వృత్తి ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
మాడభూషి శ్రీధర్ సమాధానం
‘పుస్తకం మీముందు ఉంది. ఆచార్య గురించి చెప్పడానికి సమయం ఆలోచన సరిపోదు. చూడండి. కొన్ని సంఘటనలైనా చదవండి, ఆశీస్సులు ఇవ్వండి. సలహా ఇవ్వండి. ముఖ్యంగా అనారోగ్యం వల్ల మూడేళ్ల కిందట అన్ని మరిచిపోయినా, మరిచిపోయిన ఘట్టాలు, ఒక్కో జ్ఞాపకాలు వస్తూ భగవంతుడి దయతో పోటు తరువాత రాసుకునే అవకాశం రావడం, ఆచార్యుని ఆశీస్సులనీ పెద్దల అభినందనల బలంతో మీముందుకు వచ్చాను’ అని మాడభూషి శ్రీధర్ అన్నారు.