KTR : కేటీఆర్ పై కేసు.. గవర్నర్ ఆమోదం? అరెస్ట్ చేస్తారా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమయింది.

Update: 2024-12-13 02:11 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమయింది. ఫార్ములా ఇ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆమోదం లభించిన తర్వాత రాజ్ భవన్ నుంమచి ప్రభుత్వానికి ఫైలు చేరినట్లు సమాచారం. ఫార్ములా ఇ రేస్ వ్యవహారంలో హెచ్ఎండీఏ కు సంబంధించిన నిధులను మంత్రి వర్గం ఆమోదం లేకుండా కేటీఆర్ నేరుగా నిధులను మళ్లించారని అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకుండా రెండు విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారని ఆరోపణలున్నాయి.

ఈ కేసుకు సంబంధించి...
దీనిపై అవినీతి నిరోధక శాఖ కొన్నాళ్ల క్రితం రాష్ట్ర గవర్నర్ అనుమతి కి పంపింది. కేటీఆర్ ను విచారించేందుకు, ఎఫ్ఐఆర్ ను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కోరింది. అనుమతులు లేకుండా నిధులు చెల్లించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ విచారణకు అనుమతి ఇవ్వాలనికోరింది. అయితే దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజినీర్ లను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మళ్లింపునకు సంబంధించి అర్వింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. అయితే కేటీఆర్ ప్రజా ప్రతినిధి అయినందున ఆయనను విచారించేందుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతిని కోరింది.
అరెస్ట్ చేసుకోండి...
కానీ తాను మంత్రిగా ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి నిధులను విడుదల చేశానని కేటీఆర్ చెబుతున్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే తనను అరెస్ట్ చేయాలని, తాను జైలులో ఉండి ఫిట్ అయి వస్తానని కూడా కేటీఆర్ ప్రతి సవాల్ విసురుతున్నారు. కొంతకాలం క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి కూడా రాజకీయ బాంబు పేలబోతుందని మీడియాకు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ ను విచారించి అరెస్ట్ చేసే అవకాశముందన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే కేటీఆర్ మాత్రం తాను అరెస్ట్ కు సిద్ధమని ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News