Medaram : భక్త జనసంద్రంగా మారిన మేడారం
మేడారం మహా జాతరలో నేటి నుంచి కీలక ఘట్టం చేరుకోనుంది
మేడారం మహా జాతరలో నేటి నుంచి కీలక ఘట్టం చేరుకోనుంది. ఈరోజు చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క తల్లి రానుంది. నిన్న కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెను చేరడంతో మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ప్రారంభమయింది. పగిడిద్దరాజు, గోవిందరాజు తరలి వచ్చి సారలమ్మకు స్వాగతం పలకగా, మేడారం మురిసిపోయింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాజాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. మేడారంలో ఎక్కడ చూసినా జన సందోహమే. భక్తులు గద్దెల వద్దకు చేరుకుని సారలమ్మకు తమ మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం దారులన్నీ...
నిన్న ఉదయం నుంచే మేడారం దారులన్నీ జనసంద్రంగా మారాయి. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అక్కడ పూర్తి చేసింది. భారీగా అధికారులను, సిబ్బందిని నియమించింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. తాగునీటికి, స్నానానికి అవసరమైన సదుపాయాలను కల్పించింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. దీంతో తొలి రోజు మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలి ఘట్టం పూర్తయింది.
నేడు సమ్మక రాక...
ఈరోజు చిలుకులగుట్ట నుంచి సమ్మక్క తల్లి వచ్చిభక్తుల మొక్కులు అందుకోనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్టించనున్నారు. దీంతో నేడు కూడా మేడారం భక్త జనం తరలి వచ్చిమొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వెళ్లే దారులన్నీ జనసంద్రంగా మారాయి. భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో మేడారం ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. భక్తుల శివసత్తుల పూనకాలతో మేడారం ప్రాంగణమంతా ఊగిపోయింది. భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.