Telangana : మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి?
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రిఫరెండంగానే చూడాలి
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రిఫరెండంగానే చూడాలి. ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మున్సిపాలిటీలు, నగరాల్లో కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండటంతో అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అయితే ఎవరికి వారే గెలుపు పై ధీమాగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల తరహా మాత్రం కాదు. ఎందుకంటే పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా పరిపాలన పై ప్రజా తీర్పు ఎలా ఉందన్నది స్పష్టంగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో గుర్తులుండవు కాబట్టి..ఎవరు గెలిచినా తమ వారిగా వారు చెప్పుకుంటారు.
మూడేళ్ల అధికారంలో ఉండటంతో...
అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ మున్సిపల్ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణాల్లో పేదలతో పాటు తాము గత రెండేళ్ల నుంచి చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి తమను గట్టెక్కిస్తాయని నమ్ముతుంది. మరొకవైపు మరో మూడేళ్లు అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండటంతో తమ నగరాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కే ఓటేయడమని ప్రజల ఆలోచన ఉంటుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు క్యాడర్ కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుందని, అలాగే పట్టణ ఓటర్లు విజ్ఞతతో ఓటేస్తారని, అందుకే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు పై ధీమాగా ఉంది. తమ నాయకత్వాన్ని కూడా పకడ్బందీగా రంగంలోకి దించింది.
తొలి నుంచి పట్టు ఉండటంతో...
ఇక బీఆర్ఎస్ నాయకత్వం కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమను ప్రజలు ఆదరిస్తారని భావిస్తుంది. పట్టణ ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారని, గత రెండేళ్లుగా ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరుతో పాటు అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు ప్రజల్లో పనిచేస్తాయని అంచనా వేస్తుంది. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో తమకు తిరుగులేని ఆధిపత్యం దొరుకుతుందని భావిస్తుంది. మరొకవైపు పట్టణాల్లో తమకు తొలి నుంచి ఉన్న పట్టు ఖచ్చితంగా విజయావకాశాలను మెరుగు పరుస్తుందని చెబుతున్నారు. అయితే ఎలక్షనీరింగ్ చేయడమే ప్రధానమని, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావడమే అతి పెద్ద టాస్క్ అని కారు పార్టీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
కమలం గంపెడాశలు...
బీజేపీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుంది. బీజేపీకి తొలి నుంచి పల్లెల కంటే పట్టణ ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపునకు కూడా ప్రధాన కారణం పట్టణ ఓటర్లేనని అంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ వెయ్యికి పైగా సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నామని, ఇక పట్టణాల్లో కమలం జోరును ఆపడం ఎవరి తరమూ కాదని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. కేంద్ర నాయకత్వం కూడా మున్సిపోల్స్ పై దృష్టి పెట్టి రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేసింది. మోదీ చరిష్మా కూడా మున్సిపల్ ఎన్నికల్లో పనిచేస్తాయని బలంగా నమ్ముతున్న కమలం పార్టీని ప్రజలు ఎంత మేరకు ఆదరిస్తారన్నది చూడాలి.