Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం.. ఈ ఏడాది ఎండలెలా ఉంటాయంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన వాతావరణం నెలకొంది

Update: 2026-01-29 04:16 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పగటి పూట ఎండ దంచి కొడుతుంది. సాయత్రం నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. ఒకరకంగా ఇది భిన్నమైన వాతావరణమే. గత కొంతకాలంగా శీతల గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు ఒకింత సూర్యరశ్మితగలడంతో కొంత ఆనందంగానే ఉన్నప్పటికీ జనవరి నెలలోనే ఎండ చురుక్కుమంటుండటం తో ఈ ఏడాది మే నెలలో ఇంకెంత ఉష్ణోగ్రతలు నమోదవుతాయోనన్న భయం పట్టుకుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ ఏడాది ఎండలు అత్యధింగా నమోదవుతాయని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

చలి తీవ్రత...

ఆంధ్రప్రదేశ్ లో జనవరి నెలలో సహజంగా చలి తగ్గదు. ఫిబ్రవరి నెల మధ్యలోకి వచ్చిన తర్వాత మాత్రమే చలి తీవ్రత తగ్గుతుంది. కానీ ఈసారి ముందుగానే చలి తీవ్రత తగ్గి పగటి వేళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అక్కడకక్కడ పొగమంచు కూడా కురుస్తుంది. విద్యుత్తు వినియోగం మళ్లీ పెరిగింది. ఏసీలు ఆన్ కావడం లేదు కానీ, ఫ్యాన్ ఐదు స్పీడ్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏపీలో కనిపిస్తున్నాయి. ఉక్కపోత వాతావరణం కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు చెమటతో తడసి ముద్దవుతున్నారు. నందిగామలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో మార్చిలో నమోదవుతాయని, కానీ జనవరి నెలలో గరిష్టంగా నమోదవుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకుంటున్నాయి. చలిగాలుల తీవ్రత కొంత తగ్గింది. అయితే ఒక్కసారిగా వాతావరణం మారడంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్న పిల్లలు కొంత అస్వస్థతకు గురవుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం చలిగాలుల తీవ్రత కొంత కనపడుతుంది. ఇక బయటకు మధ్యాహ్నం రావాలంటే భయపడిపోతున్నారు. సాయంత్రం చలిగాలులు వీస్తున్నప్పటికీ ఈ ఏడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News