KTR : కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కారు కేసు రాజకీయంగా దెబ్బేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2024-12-28 08:27 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు కేసు వ్యవహారంలో పీకల్లోతు ఊబిలోకి దిగిపోయే సూచనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తో పాటు ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఏసీబీ ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. యాభై నాలుగు కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు పంపించడంలో చాలా లొసుగులున్నాయని తెలిపింది. అధికారులపై వత్తిడి తెచ్చిన కేటీఆర్ ఆ నిధులను బయట సంస్థలకు పంపారని ఏసీబీ చెబుతుంది. అదే సమయంలో ఈడీకి కూడా ఏసీబీ అధికారులు తమ విచారణలో వెల్లడయిన విషయాలను తెలిపారు.

నోటీసుల మీద నోటీసులు...

ఇప్పటికే కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ అధికారి బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈ నెల 2,3 తేదీల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ విచారణకు ముందే ఈడీ అధికారులు సోదాలు చేసే అవకాశముందని కూడా సమాచారం. మరొక వైపు ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ ను విచారణకు పిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ కేటీఆర్ ను ఈ కేసులో అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, అదే సమయంలో విచారణ చేసుకోవచ్చని తెలపడంతో ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశముంది.
ఎనిమిదికోట్ల అదనపు భారం...
కేటీఆర్ మాత్రం ఫార్ములా ఈ రేసు అనేది ప్రతిష్టాత్మకమైనదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికే ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించాని చెబుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు చేసుకున్నారని కూడా ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. నాన్ బెయల్ బుల్ కేసులు కూడా కేటీఆర్ పై నమోదు చేశారు. మంత్రివర్గంతో ప్రమేయం లేకుండా నేరుగా నగదును బదిలీ చేయడాన్ని తప్పు పట్టారు. ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదని ఏసీబీ తెలిపింది. ఎలాంటి అనుమతులు లేకుండా 54 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు బదిలీ చేయడాన్ని ఏసీబీ అధికారులు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం కారణంగా హెచ్ఎండీఏపై ఎనిమిదికోట్ల రూపాయల అదనపు భారం పడిందని ఏసీబీ తెలిపింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News