బ్రిటీషర్ల అరాచకాన్ని 160 ఏళ్ల తర్వాత బయటపెట్టిన బావిలోని పుర్రెలు, ఎముకలు

బ్రిటీషర్ల చేతిలో ఊచకోతకు గురైన భారతీయులవే అని చరిత్రకారులు కూడా అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు ఆ అస్థిపంజరాలలో ఉన్న రహస్యం

Update: 2022-04-28 09:03 GMT

పంజాబ్ : కళేబరాలు రహస్యాలను బయట పెడతాయని అంటూ ఉంటారు. అయితే అది నిజమేనని కొన్ని కొన్ని సార్లు నమ్మక తప్పదు. 2014 సంవత్సరంలో పంజాబ్‌లోని అజ్నాలా ప్రాంతంలో ఒక పురాతన బావి నుండి 160కి పైగా అస్థిపంజరాలు బయటపడిన వార్త అప్పట్లో దేశ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ గా మారింది. అవి ఎప్పటివి.. ఎక్కడివి అనే ప్రశ్న దేశ ప్రజల్లో మెదిలింది. బ్రిటీషర్ల చేతిలో ఊచకోతకు గురైన భారతీయులవే అని చరిత్రకారులు కూడా అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు ఆ అస్థిపంజరాలలో ఉన్న రహస్యం బయటకు వచ్చింది. 2014లో అజ్నాలా బావిలో బ‌య‌ట‌ప‌డ్డ ఈ అస్థిపంజరాలు ఎవ‌రివి అనే అంశాన్ని తెలుసుకునేందుకు హైద‌రాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్ర‌వేత్త‌లతో పాటు ఇత‌ర భార‌త ప‌రిశోధ‌న సంస్థ‌లు విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు జ‌రిపాయి. ఆ అస్థిపంజరాలు 1857లో బ్రిటీష్ ఆర్మీ చేత చంప‌బ‌డిన భార‌త సిపాయిల‌వే నని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. సీసీఎంబీ శాస్త్ర‌వేత్త‌లు, పంజాబ్ యూనివ‌ర్సిటీ, బీర్బ‌ల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్‌(ల‌క్నో), బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీల‌కు చెందిన ప‌రిశోధ‌కులు ఈ అస్థిపంజరాల మూలాల‌ను గుర్తించేందుకు డీఎన్ఎ, ఐసోటోప్స్ ఆధారంగా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఫ్రంటైర్స్ ఇన్ జెనెటిక‌స్ అనే జ‌ర్న‌ల్‌లో ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ప‌బ్లిష్ చేశారు.

ఆ అస్థిపంజరాలు ఎవరివి ?
అప్పట్లో అస్థిపంజరాలు బయటపడినప్పుడు.. భారత స్వాతంత్య్ర ఉద్య‌మంలో 1857లో బ్రిటీష్ ఆర్మీ చేత చంప‌బ‌డిన భారత సైనికులవే అనే వాదన ప్రముఖంగా బయటకు రాగా.. ఇంకొన్ని వదంతులు కూడా వచ్చాయి. సైనికులు గుర్తింపు, భౌగోళిక మూలాలకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేక‌పోవ‌డంతో అప్పట్లో ఈ చర్చ జరిగింది. అస్థిపంజరాలు గంగా మైదాన ప్రాంతంలోని నివాసితులవని ప‌రిశోధ‌కుల‌ అధ్యయనంలో తేలింది. డీఎన్ఏ విశ్లేషణ కోసం 50 నమూనాలను, ఐసోటోప్ విశ్లేషణ కోసం 85 నమూనాలను ప‌రిశోధించారు. సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్ట‌ర్ కె తంగ‌రాజ్ మాట్లాడుతూ పూర్వీకుల‌ ఐసోటోపుల విశ్లేష‌ణ ఆహార‌పు అల‌వాట్ల‌ను తెలియ‌ప‌రుస్తుంద‌న్నారు. ఆ బావిలో ల‌భించిన అస్థిపంజ‌రాలు పంజాబ్ లేదా పాకిస్తాన్‌కు చెందిన వ్య‌క్తుల‌వి కాద‌ని తేలింద‌న్నారు. అయితే డీఏన్ఏ విశ్లేష‌ణ‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్, ప‌శ్చిమ బెంగాల్‌లోని వ్య‌క్తుల‌తో స‌రిపోలిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.
ఈ ప‌రిశోధ‌న ఫ‌లితాలు 26th నేటివ్ బెంగాల్ ఇన్‌ఫాంట్రీ బెటాలియ‌న్‌కు చెందిన బెంగాల్, ఒడిశా, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు భాగానికి చెందిన వ్య‌క్తులతో.. చారిత్ర‌క ఆధారాలు సరిపోలినట్లు పరిశోధకులు తెలిపారు. పాకిస్తాన్‌లోని మియాన్ మీర్‌లో నియ‌మించ‌బ‌డ్డ 26th బెటాలియ‌న్‌కు చెందిన సైనికులు తిరుగుబాటు ఉద్య‌మంలో బ్రిటీష్ అధికారుల‌ను చంపారు. అయితే వారిని అజ్నాలా స‌మీపంలో బ్రిటీష్ ఆర్మీ బంధించి ఉరి తీసిన‌ట్లు ప‌రిశోధ‌న‌లు తెలుపుతున్నాయని వెల్లడించారు.
సీసీఎంబీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వినయ్ న‌డికూడిని మాట్లాడుతూ.. పురాత‌న డీఎన్ఏ అధ్య‌య‌నం మ‌న గ‌తంతో పాటు చారిత్ర‌క దృక్ప‌థాన్ని అర్థం చేసుకోవడంలో శ‌క్తివంతంగా ఉప‌యోప‌డే సాధ‌నం అని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పురాత‌న డీఎన్ఏ అధ్య‌య‌నాన్ని చేప‌ట్టాల‌ని సీసీఎంబీ యోచిస్తోంద‌న్నారు. ఈ అధ్య‌య‌నం అనేక చారిత్ర‌క‌, పూర్వ చారిత్ర‌క వాస్త‌వాల‌ను వెలుగులోకి తెస్తుంద‌ని ఆయ‌న అభిప్రాయప‌డ్డారు.
DNA అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన BHUలోని జువాలజీ విభాగం ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే, ఈ అధ్యయనం ఫలితాలు భారతదేశం మొదటి స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయానికి చెందిన సాక్ష్యాలు అని తెలిపారు. CCMB డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ, "పురాతన DNA అధ్యయనం మన పూర్వీకుల చరిత్రను అర్థం చేసుకోవడమే కాకుండా చారిత్రక దృక్పథాన్ని అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడే శక్తివంతమైన సాధనం. CCMB పెద్ద ఎత్తున పురాతన DNA అధ్యయనాన్ని చేపట్టాలని యోచిస్తోందని, గతానికి సంబంధించిన అనేక విషయాలను బయటకు తీసుకుని వస్తుంది" అని అన్నారు.


Tags:    

Similar News