Nitish Kumar : నితీశ్ కు పాలన ఒక్కటే కాదు.. అంతా ఇక కత్తిమీద సామే
భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లోనూ పాతుకుపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లే
భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లోనూ పాతుకుపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లే. బీహార్ లో నితీశ్ కుమార్ తో పొత్తు పెట్టుకుని గెలిచినా నితీశ్ కుమార్ ఇప్పుడు బీజేపీ బంధనంలో చిక్కుకుపోయారు. ఏ మాత్రం తేడా వచ్చినా నితీశ్ కుమార్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయడానికి ఏ మాత్రం సందేహించరు. ఎందుకంటే ప్రస్తుతం జేడీయూ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకోసం నితీశ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తుంది. అయితే ఎన్నాళ్లన్నది చెప్పలేం. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే నితీశ్ కు పదవీ గండం తప్పదన్న హెచ్చరికలు నిరంతరం మోగుతూనే ఉంటాయి.
అతి పెద్ద పార్టీగా...
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు వచ్చాయి. అందులో బీజేపీకి 89 స్థానాలు దక్కించుకుంది. జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. లోక్ జనశక్తి పార్టీ ( రామ్ విలాస్ పాశ్వాన్) కు చెందిన పార్టీకి పందొమ్మిది స్థానాలు వచ్చాయి. ఆర్ఎల్ఎంకు నాలుగు స్థానాలు, హెచ్ఏఎం(ఎస్) కు ఐదు స్థానాలు వచ్చాయి. దీంతో ఎన్డీఏకు 202 స్థానాలు లభించాయి. బీహార్ మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు మాత్రమే. జేడీయూ నుంచి మరో ఐదుగురిని చీలిస్తే చాలు బీజేపీ అక్కడ నితీశ్ కుమార్ తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశముంది. అందుకే నితీశ్ కుమార్ నిత్యం తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిందే.
జేడీయూకు బీజేపీ మద్దతు...
కేంద్రంలో జేడీయూ మద్దతు అవసరం కాబట్టి ప్రస్తుతం నితీశ్ కుమార్ జోలికి బీజేపీ వెళ్లదు. అయితే అదే సమయంలో నితీశ్ కుమార్ ఏ మాత్రం కాలరెగరేస్తే మాత్రం ఊరుకునే తత్వం మాత్రం బీజేపీ నేతలది కాదు. బీహార్ కు ప్రత్యేక హోదా.. నిధులు వంటి వాటిపై కూడా పెద్దగా నితీశ్ కుమార్ కు వాయిస్ ఉండదు. ఆయన బీజేపీతో సర్దుబాటు చేసుకుని ఎప్పటికప్పడు వారితో సఖ్యతగా మెలుగుతూ తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాల్సిందే. ఆ పరిస్థితి నితీశ్ కుమార్ తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ చెప్పినట్లు నితీశ్ కుమార్ వినాల్సిందే. అంతే తప్ప తలెగరేయడానికి వీలు లేదు. అదే సమయంలో ఇదే స్ట్రాటజీని మిగిలిన రాష్ట్రాల్లోనూ బీజేపీ అనుసరించే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యానన్న సంతోషం కంటే బీజేపీ చేతిలో బందీగా మారారనే ఆయన ఎక్కువగా ఫీలవుతున్నారట.