Peddireddy : పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకనేత. ఆయన కుటుంబం చిక్కుల్లో చిక్కుంది.
వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకనేత. ఆయన ఒక రకంగా చెప్పాలంటే.. జగన్ తర్వాత ఆయన మాత్రమేనని అంటారంతా. ఎందుకంటే జగన్ కు అంతా తానే అయి వ్యవహరించేది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమేనంటారు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ని స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 70 రోజులకు పైగానే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిధున్ రెడ్డి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అందరూ ఓడిపోయినా పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం ఓటమి చవి చూడలేదు.
ముగ్గురు గెలిచినా...
పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో ఈ రెండు మాత్రమే వైసీపీకి దక్కాయి. పార్లమెంటు నియోజకవర్గాల్లో వచ్చిన మూడు స్థానాల్లో ఒకటి కడప, మరొకటి అరకు, ఇంకొకటి రాజంపేట మాత్రమే. అలా పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా వేళ్లతో సహా పెకిలించడానికి ప్రయత్నాలు మొదలయినట్లే కనిపిస్తుంది. అటవీ భూముల ఆక్రమణ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డంగా బుక్కయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటవీ భూముల చట్ట ప్రకారం శిక్షలు కూడా భారీగా పడే అవకాశాలుంటాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
వైరం ఈ నాటిది కాదు...
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్య వైరం ఈ నాటిది కాదు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఇద్దరూ చదువుకునే రోజులలో తలెత్తిన వైరం నేటికీ రాజకీయంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పెద్డిరెడ్డి కుటుంబం అటవీ భూముల విషయంలో చిక్కుల్లో పడినట్లేనని అంటున్నారు. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కల్యాణ్ బయటపెట్టిన వీడియోతో దాదాపు 74 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు కష్టాలు మొదలయినట్లేనని అంటున్నారు. అందుకోసమే పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లినట్లు కూడా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. హెలికాప్టర్ లో వెళ్లి వీడియోను చిత్రీకరించడం కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇరికించడానికేనన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పెద్దాయన పెద్దిరెడ్డి రెడీ అవ్వాల్సిందే అన్నట్లుంది పరిస్థితి.