Revanth Reddy : రేవంత్ కు ప్రత్యర్థులందరికీ వార్నింగ్ ఇచ్చినట్లేగా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత ఊపు తెచ్చింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత ఊపు తెచ్చింది. రెండేళ్లలో రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రత్యర్థులు చేసే విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదన్నది ఈ ఎన్నిక ఫలితం ద్వారా చూడాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంత సులువుగా ఎంపిక కాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా నాటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడంలో విఫలమయింది.
ఫైర్ ను చూసిన తర్వాతే...
అందుకే టీడీపీ నుంచి వచ్చినా రేవంత్ రెడ్డిలో ఉన్న ఫైర్ ను చూసి కాంగ్రెస్ నాయకత్వం పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి నాడు పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నకేసీఆర్ పై రేవంత్ రెడ్డి మాటల దాడి కూడా ప్రజలను ఆకట్టుకుంది. ఫలితంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందువల్లనే ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. సీనియర్లున్నా, పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకున్న వారు పార్టీలో ఉన్నా వారందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం ఆయన పనితీరును పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంది. అయితే రేవంత్ రెడ్డి రాహుల్ దూరం పెడుతున్నారని కూడా ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి ఈ ఎన్నిక ఫలితంతో చెక్ పెట్టినట్లయింది.
పార్టీలో ఉన్న వారికి...
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ముఖ్యమంత్రిని కూడా కేర్ చేయని ఎమ్మెల్యేలుంటారు. అలాంటి వారందరి నోళ్లు ఈ ఎన్నిక ఫలితం మూత పడేలా చేస్తుందనడలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవి కొట్లాడి తెచ్చుకున్నది కాదని, కష్టపడి తెచ్చుకున్నదని రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయని విధంగా కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు చేసి ప్రజలను మెప్పించి, ఒప్పించి సీటును దక్కించుకోగలిగారు. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో ఇక చెక్కు చెదరని విధంగా ఉందన్నది మరోసారి అర్థమయింది. ఆయన ప్రత్యర్థులకు రేవంత్ ఈ రకంగా జవాబు చెప్పినట్లయింది.