Ys Jagan : బిందాస్ గా కూర్చుంటే.. అధికారం మళ్లీ దూరమవుతుంది భయ్యా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బీహార్ ఎన్నికల ఫలితాలు వార్నింగ్ బెల్స్ లాంటివి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బీహార్ ఎన్నికల ఫలితాలు వార్నింగ్ బెల్స్ లాంటివి. ఒకటి గమనించారా.. ఆంధ్రప్రదేశ్ లో 2024లో ఎన్నికలు తరహాలోనే బీహార్ లోనూ రెండో విడత ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. అదీ సాయంత్రం ఐదు గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ లైన్ లో నిలబడి ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశారు. ఏపీలోనూ మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. అందుకే బీహార్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు లభించాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇక్కడ 2024 ఎన్నికల్లో వైసీపీకి కూడా కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అందుకే జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాను తిరిగి అధికారంలోకి వస్తానని కూర్చుంటూ మళ్లీ ఒకసారి బెంగళూరుకే పరిమితమవ్వాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా...
ఇప్పుడు బీజేపీ కూటమి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా విజయం సాధిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి వాటిని వారు పెద్దగా పట్టించుకోరు. శాసనసభ ఎన్నికలపై సీరియస్ గా మోదీ నుంచి పార్టీ అగ్రనేతలందరూ దృష్టి పెడతారు. అప్పుడు కర్సయిపోయేది విపక్షంలో ఉన్నవారు మాత్రమే. ప్రభుత్వ వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని భావించి జగన్ ఏ మాత్రం అలక్ష్యం వహించినా ఏపీలోనూ బీజేపీ బీహార్ వంటి స్ట్రాటజీనే అనుసరిస్తుంది. అందుకు ఎంత మాత్రం వెనకాడదు. చంద్రబాబు నాయుడు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. తన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకంతో పాటు, మోదీ, పవన్ కల్యాణ్ చరిష్మాతో మరొకసారి విజయం సాధిస్తామన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. అందుకే టీడీపీ ఇక ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండదని ఇటీవల చంద్రబాబు కామెంట్ చేయడానికి కారణం కూడా అదే కావచ్చు.
సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ...
అయితే బీజేపీకి జగన్ పై కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కనపడుతుందని వైసీపీ నేతలు భావించవచ్చు.. తమ్ముడు.. తమ్ముడే.. అన్నట్లు.. రాజకీయంలో కేవలం తమతో సఖ్యతగా ఉంటే సరిపోదు. బీజేపీ తమతో నేరుగా పొత్తు పెట్టుకున్న వారితో మాత్రమే ప్రయాణిస్తుంది. అవసరమైతే జగన్ పార్టీని ఓడించడానికి అన్ని శక్తియుక్తులను ఒడ్డుతుంది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో.. ఏపీలోనూ తమ ప్రభుత్వం రావడం అంతే ముఖ్యమని బీజేపీ భావిస్తుంది. అది రాజకీయం. అందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన పనిలేదు. జగన్ బిందాస్ గా బెంగళూరులో కూర్చుని ప్రభుత్వ వ్యతిరేకత, తాను గతంలో చేసిన పనులు గెలిపిస్తాయని భావిస్తే మాత్రం జగన్ మరో తేజస్వి గా మారతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం తెలిసి ఇప్పుడిప్పుడే వైసీపీ నుంచి నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీ లో చేరే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి. సో.. జగన్ బీ కేర్ ఫుల్.