Pawan Kalyan : పవన్ పాలిటిక్స్ లోనూ పవర్ స్టార్ కావాలంటే ఇలా చేయాల్సిందేనా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలు చేసి తప్పుకోవాలని చూస్తున్నారు

Update: 2025-11-27 07:50 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలు చేసి తప్పుకోవాలని చూస్తున్నారు. ఏ సమస్య అయినా గత ప్రభుత్వం అన్న వైఖరినే అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు సముద్ర జలాలతో నాశనమై రైతులు ఆవేదన తెలుసుకునేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్ మరోసారి విమర్శించారు. అయితే అక్కడి రైతు మాత్రం ఈ సమస్య నలభై ఏళ్లుగా ఉందని చెప్పడంతో ఆయన కంగుతినాల్సి వచ్చింది. సమస్య ఎప్పటి నుంచి ఉన్నదీ పూర్తిగా తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ కోనసీమ రైతుల గొంతుకనై ఉంటానని చెప్పి మరోసారి సినిమా డైలాగ్ కొట్టే ప్రయత్నం చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

చంద్రబాబు పదిహేడేళ్ల కాలంలో...
ఇక మరో పదిహేనేళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పవన్ కల్యాణ్ చెప్పడం కూడా ట్రోలింగ్ కు కారణమవతున్నాయి. జగన్ అధికారంలో ఉన్నది కేవలం ఐదేళ్లు మాత్రమేనని, ఐదేళ్లలో రెండేళ్లు కరోనాతో సరిపోయిందని, జగన్ పాలన చేసింది కేవలం మూడేళ్లు మాత్రమేనని వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన ఆంధ్రప్రదేశ్ లోనూ పదిహేడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పదిహేడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి చేయలేని పనిని జగన్ ఐదేళ్లలో ఎలా చేస్తారని తిరిగి పవన్ కు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీపై నెపం వేస్తే...
పవన్ కల్యాణ్ తాను ప్రశ్నించి.. తాను సమాధానం చెప్పుకోవడంతోనే సరిపోతుందని, ఇకనైనా ఒక మాట మాట్లాడే ముందు గతంలో చేసిన హామీలను గుర్తు చేసుకోవాలని కోరుతున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాల విషయంలో గళం విప్పుతుంటేనే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో హీరోగా నిలబడతారన్నది జనసేన క్యాడర్ నుంచి కూడా కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అలాగే సమస్యలను పరిష్కరించాలి. అంతేతప్ప వైసీపీ పై నెపం నెట్టుకుంటూ పోతే ప్రజలు కూడా రానున్న కాలంలో నమ్మే పరిస్థితి ఉండదు.


Tags:    

Similar News