Ys Jagan : జగన్ వారితో టచ్ లోకి వెళ్లారా? ఆశీర్వాదం లభించిందటగా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. వరసగా జరుగుతున్న పరిణామాలతో పాటు ఎన్నికలు కూడా జగన్ ను వారికి మరింత దగ్గరకు చేశాయంటున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీ పెద్దల వద్దకు జగన్ రాయబారాన్నిపంపించినట్లు సమాచారం అందుతుంది. తాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో మద్దతు తెలపకపోయినా ఖచ్చితంగా పరోక్ష మద్దతు ఉంటుందని, ఎప్పటిలాగానే తన మద్దతు ఉంటుందని, అందుకు సహకారం అందించాలని కూడా కోరినట్లు పెద్దయెత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని కొందరు రాష్ట్ర నేతలు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర స్థాయి బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కొట్టిపారేస్తున్నప్పటికీ అందులో నిజం కొంత ఉందని మాత్రం ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు.
ఎవరూ విమర్శలు చేయకపోవడంతో...
ఆంధ్రప్రదేశ్ కు వచ్చే కేంద్ర మంత్రులు, ప్రధాని వరకూ ఎవరూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడంతో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. 2029 ఎన్నికల్లో తాను గెలవాలంటే అందుకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం అవసరమని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలు కూడా జగన్ ను అంత సులువుగా శత్రువుగా మలచుకునే ఆలోచనల్లో లేరన్నది కూడా నిజం. ఎందుకంటే అనేక రాజకీయ కారణాలు ఢిల్లీ పెద్దలకు ఉన్నాయి. జగన్ పరంగా ఒక్క కేసులు తప్పించి మరే రకమైన ఇబ్బందులు, ఒత్తిడి వారిపై ఉండదు. అదే సమయంలో కూటమిగా ఉన్న సమయంలో కొంత వత్తిడితో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను విధిగా అమలు పర్చాల్సి ఉంటుంది.
వచ్చే ఎన్నికల నాటికి...
ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల ఆలోచన కాస్త అటు ఇటుగా ఉన్నట్లు భావించిన జగన్ ఢిల్లీ పెద్దల వద్దకు రాయబారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు వారు ఇటు తిరస్కరించలేదు. అలాగని ఓకే చెప్పలేదంటున్నారు. 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో ఇంకా వేచి చూడాలన్న ధోరణిలోనే ఢిల్లీ పెద్దలున్నారని తెలిసింది. అయితే జగన్ ను వదులుకునేందుకు కూడా వారు సుముఖంగా లేరు. అందుకే ఏపీకి వచ్చే వారు జగన్ పైనా, గత పాలనపైన విమర్శలు చేయకపోవడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారంటున్నారు. మరి పదిహేనేళ్ల పాటు పవన్ కల్యాణ్ కలసి ఉన్నామని చెబుతుండటంతో ఏపీ రాజకీయాల్లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.