Bihar Assembly Elections : ఖతం... బైబై..‌. టాటా... గుడ్ బై... గయా

దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి

Update: 2025-11-14 07:51 GMT

దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలోనూ, క్షేత్ర స్థాయిలోనూ ఆ పార్టీ క్రమంగా పట్టు కోల్పోతుంది. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడి ఉండటంతో హస్తం పార్టీకి ఈ దుస్థితి పట్టింది. అదే కర్ణాటక, తెలంగాణలో జాతీయ పార్టీగానే కాంగ్రెస్ పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. కానీ మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్లపైనే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2004కు ముందు పరిస్థితులు ఏంటి? 2014 తర్వాత ఏంటి? అన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది. పదేళ్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకోలేకపోయింది.

దశాబ్దాల కాలం రికార్డు చేస్తూ...
నెహ్రూ కాలం నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలోనూ ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు మంచి పట్టు ఉండేది. పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండేది. కానీ రాను రాను రాహుల్ గాంధీ జమానాకు వచ్చే సరికి ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తమ పట్టును కోల్పోయింది. ఒకప్పుడు ఈ ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పిడికిలి బిగించి గెలిచేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీజేపీని తట్టుకోవాలంటే ప్రాంతీయ పార్టీలతో కలసి వెళ్లాలని అనుకోవడమే ఆ పార్టీ తనకు తానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. కేవలం రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం అర్రులు చాస్తుంది.
బీహార్ లో సింగిల్ డిజిట్ కేనా?
బీహార్ లోనూ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ బలపడటానికి పరోక్షంగా కారణమయింది. బలమైన కాంగ్రెస్ నేతలు విడిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నారు. అది కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. మహారాష్ట్రలోనూ పొత్తులతోనే బరిలోకి దిగింది. ఒకప్పుడు బలమైన నాయకత్వం రాష్ట్రాల్లో ఉండేది. కానీ రానురాను రాష్ట్రాల్లో లీడర్ షిప్ బలహీనంగా మారింది. బీహార్ లోనూ అదే జరిగింది. మహా ఘట్ బంధన్ పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్నప్పటికీ, రాహుల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేపట్టినప్పటికీ రాష్ట్రాల్లో బలహీనమవుతుంది. కాంగ్రెస్ బీహార్ లో సింగిల్ డిజిట్ కు పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఎంఐఎం కంటే తక్కువ స్థానాల్లో లీడ్ లో ఉంది. అదీ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అది మెజారిటీలో కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పట్టు కోల్పోతుంది. అందుకే రాహుల్ గాంధీ డైలాగ్ లాగానే కాంగ్రెస్ ఖేల్...ఖతం... బైబై..‌. టాటా... గుడ్ బై... గయా అన్న డైలాగు గుర్తుకొస్తుంది.


Tags:    

Similar News