Bihar Assembly Elections : మోదీకి తిరుగులేదు - కమలం చెక్కు చెదరలేదు
బీహార్ ఎన్నికలలో బీజేపీ కూటమి అధికారం దిశగా పయనిస్తుంది
బీహార్ ఎన్నికలలో బీజేపీ కూటమి అధికారం దిశగా పయనిస్తుంది. నిజంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ విజయం బీజేపీ కూటమికి ఇది మంచి బూస్ట్ ఇచ్చినట్లే. త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ వేవ్ తో వెళ్లాలంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ అలయన్స్ గెలవడం ముఖ్యం. అది సాధించినట్లయింది. ఏకపక్షంగా బీహార్ ఓటర్లు బీజేపీ కూటమికి పట్టం కట్టారు. అందుకే 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీలో దాదాపు రెండు వందల అసెంబ్లీ స్థానాలకు దగ్గరగా బీజేపీ కూటమి వెళ్లడం అంటే వన్ సైడ్ అనే చెప్పాలి. అందుకే ఇది వన్ సైడ్ వార్ అని స్పష్టంగా చెప్పాలి.
కాంబినేషన్ వర్క్ అవుట్ అయి...
నిజానికి బీహార్ లో మోదీ, నితీష్ కుమార్ అంటే నమో కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయింది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కూడా బాగా పనిచేశాయి. నితీష్ కుమార్ కు ముఖ్యంగా మహిళల ఓట్లు అనుకూలంగా ఏకపక్షంగా పడినట్లు కనిపిస్తుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయడంతో అనేక కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నితీష్ కుమార్ పది వేల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం కూడా కూటమికి కలిసి వచ్చింది. సీమాంచల్ లో ఆర్జేడీకి పట్టుంది. అలాంటి ప్రాంతంలోనూ బీజేపీ, జేడీయూలు గెలవడమంటే ప్రజలు ఇక ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించడానికి సిద్ధమయినట్లు కనిపించింది.
అన్ని విషయాల్లోనూ...
ఇక ఎన్డీఏ కూటమి తొలి నుంచి ఒక పద్ధతి ప్రకారం వెళుతుంది. సీట్ల సర్దుబాటులోనూ ఎలాంటి అలకలు, ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రకటించింది. అదే సమయంలో అన్ని సామాజికవర్గాల నేతలను దగ్గరకు తీసుకుని ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేసింది. ఇక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కానీ, ప్రచారంలో కానీ బీజేపీ కూటమి మహా ఘట్ బంధన్ కంటే ముందంజలో ఉంది. ఆర్జేడీ వస్తే అవినీతి హెచ్చుమీరిపోతుందన్న బీజేపీ అందులోనూ మోదీ పదే పదే చేసిన ప్రచారం ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లింది. అన్నీ కలిసి బీజేపీ కూటమిని కలసి వచ్చినట్లే కనిపిస్తుంది. ఇక మోదీకి తిరుగులేదు. వరసగా ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ను దానికి మద్దతిచ్చే పార్టీలను ఖతం చేస్తూ పోతుంది.