Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?

Update: 2025-11-26 07:59 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికలకు ముందు అధికారంలో లేరు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అందుకే ఏ రకమైన విమర్శలు చేయడానికైనా ఎన్నికల సమయంలో వీలవుతుంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి పవన్ చేతిలో ఉన్న పవర్ అస్త్ర మాత్రం పవర్ అయిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు జగన్ ను విమర్శిస్తే కుదరదు. కేవలం కూటమి ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించే చెప్పుకుని ప్రజల ముందుకు వెళ్లాలి. అతి అంత సులువు కాదు. ఎప్పుడైనా నెగిటివ్ వ్యాఖ్యలకు ఉన్న పాజిటివిటీ ప్రజల్లో పాజిటివ్ కామెంట్స్ కు ఉండదు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వారికి ఎవరికైనా ఇలాగే అర్థమవుతుంది

రెండోసారి అధికారంలోకి...
అందుకే పవన్ కొత్త అస్త్రాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు జనసేన క్యాడర్ తో పాటు కాపు సామాజికవర్గం కూడా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు మార్లు పవన్ కల్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. దీంతో ఆ అస్త్రం కూడా పవన్ చేతులో లేదు. ఇక కూటమి ప్రభుత్వం రెండోసారి ఎన్నికైతే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది చప్పగా ఉంటుంది. తప్పించి ప్రజలకు రుచించదు. జగన్ ను విమర్శించినా, వైసీపీ పాలనలో లోపాలను ఎత్తి చూపినా అవుట్ డేటెడ్ అవుతాయి.
అనేక సమస్యలను ...
అందులోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనూ చివరకు రాజధాని అమరావతి రైతుల అవస్థల విషయంలోనూ పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఇక ఆయన నిజాయితీపరుడైనా సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలోనూ వ్యతిరేక వార్తలు వస్తుండటంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ జనం వద్దకు వెళ్లాలంటే ఏం చేయాలన్న దానిపై కొంత తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటంతో అనేక విషయాలు కలసి వస్తాయని నమ్ముతున్నారు. అన్నీ కలసి వచ్చి తమను రెండోసారి అధికారంలోకి తెస్తాయని భావిస్తున్నారు. మరి జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News