బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయంతో భారతదేశం మొత్తం కాషాయమయం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయనుంది. ఇక మోదీ విజయానికి అడ్డుకట్టే వేసే వారు కూడా లేరు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కొంత ఆలస్యమయినా ఆ రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడాల్సిందే. ఇది రాసిపెట్టుకోమంటున్నారు.. మోదీ. అవును... రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు బీజేపీ పరమవుతాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రమే ఉండాలన్నదే ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా మోదీ టీం అడుగులు వేస్తుంది. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ముందుగా తమకు బలంలేని రాష్ట్రాల్లో అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, తర్వాత వాటిని పక్కన పెట్టి బీజేపీని గెలిపించుకోవడం లక్ష్యంగా బీజేపీ వెళ్లనుంది. ఇక కాంగ్రెస్ చేష్టలుడిగి చూడాల్సింది.
మూడు రాష్ట్రాలపై...
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో మార్కు చాటడంపై ఫోకస్ చేసింది. బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అని నిన్న మోదీ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. అటు తమిళనాడులోనూ పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పోరును త్రిముఖంగా మార్చే ప్రణాళికల్లో ఉంది. బీహార్‌లో ఎన్డీయే బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఇక తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాల్ పై నే మోదీ, షాల దృష్టి ఉందన్నది వాస్తవం. 243 సీట్లకు 202 సీట్లు రావడంతో ఇక ఇదే పంథాను ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించేందుకు మోదీ టీం రెడీ అయిపోయింది. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే కమ్యునిస్టులను వెనక్కు నెట్టేసింది.
అక్కడ కాంగ్రెస్ బలహీనమే...
కాంగ్రెస్ అక్కడ బలహీనంగా ఉంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మూడు దఫాలుగా వరస విజయాలు సాధిస్తుంది. మమత బెనర్జీ పాలనపై ఉన్న వ్యతిరేకతను సులవుగా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా పశ్చిమ బెంగాల్ లో పాగా వేయడంపైనే ఇప్పుడు మోదీ, అమిత్ షాల ఫోకస్ పెట్టినట్లు కనపడుతుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అక్కడ బీజేపీనే. ఆ ఒక్కటీ చాలు.. పాగా వేయడానికి. అందుకే ఈసారి కొట్టేది కోల్ కత్తా కోటనేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఒడిశాలో క్రమంగా కాంగ్రెస్ ను బలహీన పర్చి సొంతంగా ఎదుగుతూ చివరకు బీజేపీ ఆ రాష్ట్రాన్ని దక్కించుకుంది. ఇప్పుడు అదే ఫార్ములాను దీదీపై ప్రయోగించనుంది. సో.. దీదీ.. బీ అలెర్ట్.. నెక్ట్స్ టార్గెట్ మీరే. ఇక తర్వాత దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలన్న ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళుతుంది.