Chandrababu : తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. ఆ యువనేతకు షాక్ ఇచ్చిన అధినేత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పర్యటనలలో తొలి అభ్యర్థిని ప్రకటించినట్లయింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పర్యటనలలో తొలి అభ్యర్థిని ప్రకటించినట్లయింది. అరకు నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జిగా సియ్యారి దొన్నుదొర పేరును ఆయన ప్రకటించారు. ఈరోజు జరిగిన రా కదిలిరా సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో కిడారి శ్రావణ్ ను పక్కన పెట్టినట్లయింది. కిడారి శ్రావణ్ కు ఈసారి అరకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడం లేదని ఆయన చెప్పినట్లయింది. ఆయనను తగిన రీతిలో గౌరవించుకుంటామని చంద్రబాబు ప్రకటించడంతో ఏజెన్సీ ప్రాంతంలో చంద్రబాబు తొలి అభ్యర్థిని పార్టీ తరుపున ప్రకటించినట్లయింది. ఇన్‌ఛార్జిగా ప్రకటించిన దొన్నుదొర వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేయనున్నారు.
అరకుపై పట్టు సాధించాలని...
ఏజెన్సీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అంత పట్టులేదు. ఎప్పటి నుంచో అక్కడ కాలుమోపాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ గిరిజనులు కాంగ్రెస్, వైసీపీలను మాత్రమే గెలిపిస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఏజెన్సీ ప్రాంతంలో గెలవాలన్న లక్ష్యంతో ఆయన తొలి ప్రకటన చేశారు. అరకులో ఇప్పటికే వైసీపీ పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పేరును ఇన్ ఛార్జిగా ప్రకటించింది. అయితే మాధవి నాన్ లోకల్ అంటూ అక్కడి వైసీపీ నేతలు కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న వారితో ఇటీవల పార్టీ వ్యవహాలను పరిశీలించే వైవీ సుబ్బారెడ్డి భేటీ అయి వారితో చర్చించారు. అయినా సరే నాన్ లోకల్ ను తెచ్చి తమపై రుద్దుతున్నారంటూ లోకల్ నేతలు మండి పడుతున్నారు.
గత ఎన్నికలలో రెండో ప్లేస్ లో నిలిచిన...
దీంతో చంద్రబాబు ఈరోజు అరకు పర్యటనలో దొన్నుదొర పేరును ప్రకటించి లోకల్ లో పాగా వేయాలని ప్లాన్ చేశారు. అయితే యువనేత కిడారి శ్రావణ్ ను మాత్రం పక్కన పెట్టినట్లయింది. కిడారి సర్వేశ్వరరావు 2014 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో టీడీపీలోకి మారారు. తర్వాత ఆయన మావోల చేతిలో మరణించారు. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ ఢిల్లీలో ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతూ తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే కిడారి శ్రావణ్ ను మంత్రి వర్గంలోకి కూడా తీసుకున్నారు.
మూడో ప్లేస్ లో...
కానీ వెనువెంటనే ఎన్నికలు రావడంతో కేవలం ఆరు నెలలమంత్రిగానే కిడారి శ్రావణ్ మిగిలి పోయారు. ఎన్నికలు రావడంతో ఆయన ఎన్నిక కాకపోవడంతో మధ్యలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చెట్టి ఫల్గుణ గెలుపొందారు. కిడారి శ్రావణ్ కుమార్ టీడీపీ తరుపున పోటీ చేసి మూడో స్థానంలో మిగిలిపోయారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దన్నుదొరకు దాదాపు 27 వేల ఓట్లపై చిలుకు వచ్చి రెండో ప్లేస్ లో నిలిచారు. ఇప్పుడు ఆయనను ఇన్ ఛార్జిగా నియమించి అరకు నియోజకవర్గంలో తొలి సారి పసుపు జెండా పాతాలని చంద్రబాబు నిర్ణయించారు. కిడారి శ్రావణ్ కుమార్ మాజీ మంత్రి అని పేరు వచ్చినా ఆయన గెలుపొందకపోవడంతో ఆయనను చంద్రబాబు పక్కన పెట్టారు.