Jana Sena : మరక అంట కూడదనుకుంటే.. మౌనమే మంచిదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నింటికీ దూరంగా ఉంటే మేలు అని భావిస్తున్నట్లుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నింటికీ దూరంగా ఉంటే మేలు అని భావిస్తున్నట్లుంది. తన మీద, తన పార్టీ మీద మరక పడకుండా ఎటువంటి ప్రభుత్వ నిర్ణయాల్లో తన ప్రమేయం లేదని ఆయన బయటకు కనిపిస్తున్నారు. ఒక రకంగా పవన్ కల్యాణ్ వ్యూహం కావచ్చు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తక్కువ ధరలకు భూములకు కేటాయించడంతో పాటు గీతం యూనివర్సిటీకి అతి విలువైన భూములను అప్పగించడం వంటి వల్ల ప్రజల్లో కూటమి పార్టీలంటే కొంత ప్రజల్లో చులకన ఏర్పడింది. ప్రజల సొమ్మును కారు చౌకగా కట్టబెట్టడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలోనూ ఈ భూపందేరాలపై నెగిటివ్ టాక్ వినపడుతుంది.
ప్రభుత్వ నిర్ణయాలపై...
ఇక ప్రధానమైనవి రాజధాని అమరావతి కోసం రెండో దఫా ల్యాండ్ పూలింగ్ తో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల నిధులను కేటాయించడంతో పాటు అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి వాటిపై జనసేన నేతలు ఎవరూ మాట్లాడవద్దంటూ ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం వెళ్లినట్లు తెలిసింది. బీజేపీ నేతలు కూడా తెలిసీ తెలియనట్లు చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరకంగా చంద్రబాబు తీసుకునే ఈ నిర్ణయాలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగానే బీజేపీ, జనసేనలు గత కొద్ది కాలంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందని తెలిసి సైలెంట్ గా ఉన్నారంటున్నారు.
వ్యతిరేకత ఏదైనా ఉంటే...
ఏదైనా వ్యతిరేకత ఉంటే అది టీడీపీయే మూటకట్టుకుంటుందని, తమ ప్రమేయం లేదని చెప్పుకోవడానికి కొంత వీలవుతుందని అంటున్నారు. అందుకే ఎక్కువ సార్లు మంత్రి వర్గ సమావేశాలకు పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడానికి అదే కారణమని జనసేన నేతలు అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలపై అవినీతి, ఆరోపణలు కూడా ఆ పార్టీ అనుభవిస్తుందని, తమకు మరక అంటకుండా ఉండాలంటే మౌనమే బెటర్ అన్న నిర్ణయానికి పవన్ కల్యాణ్ వచ్చినట్లు తెలిసింది. అందుకే తన పార్టీ కి సంబంధించి, తమ పార్టీకి కేటాయించిన శాఖలకే పరిమితమవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అందుకే నేతలు కూడా ఎవరూ ఈ విషయాల్లో తొందరపడి రియాక్ట్ కావద్దని, జనసేన పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలపై మాత్రం వెంటనే స్పందించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో మరక అంటకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది సుస్పష్టం.