YS Jagan : జగన్ కు శత్రువులు.. పక్కనే ఉన్నారుగా...గెలుపు అంత తేలిక కాదా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఈ సారి ఎన్నికలు కూడా అంత తేలిగ్గా ఉండేటట్లు కనిపించడం లేదు

Update: 2026-01-30 08:54 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఈ సారి ఎన్నికలు కూడా అంత తేలిగ్గా ఉండేటట్లు కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల నుంచే జగన్ కు వ్యతిరేకత కనపడుతుంది. సొంత కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం చక్కదిద్దుతారన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. జగన్ కు అధికారం సూట్ కాదని ఆమె సూటిగా చెప్పేశారు. జగన్ లో మార్పు రావాలని, అప్పుడే ఆయనకు అధికారం దక్కుతుందని తెలిపారు. జగన్ లో స్వార్థం ఎక్కువని, దాని నుంచి బయటపడితే తప్ప జగన్ వచ్చే ఎన్నికల్లోనూ గెలవలేడని వైఎస్ షర్మిల కుండ బద్దలు కొట్టారు. ఆస్తుల పంచాయతీ ఇంకా తెగినట్లు కనిపించడం లేదు.

తల్లి, చెల్లి రాజకీయంగా దూరమై...
గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయి. అందులో కుటుంబ సభ్యుల ఆరోపణలు కూడా ఒకటి అని చెప్పాలి. చెల్లి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ జగన్ కు రాజకీయంగా ఇప్పటికే దూరమయ్యారు. కానీ గత రెండేళ్ల నుంచి వారిని తన వారిగా దగ్గరకు చేర్చుకోవడంలో జగన్ విఫలమయినట్లే కనిపిస్తుంది. వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల సమయంలోనూ అడ్డం తిరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జనంలోకి వెళ్లి తమ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని ఆమె పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా జగన్ కు రాజకీయంగా నష్టమే. అలాగని వారిని సముదాయించే ప్రయత్నాలు కూడా ఇంత వరకూ చేయలేదని అంటున్నారు.
పాదయాత్ర చేసినా...
మరొకవైపు మరొక ఏడాదిన్నరలో జగన్ పాదయాత్ర మొదలు పెడతానని చెబుతున్నారు. జగన్ పాదయాత్ర చేసినా ఈసారి అధికారంలోకి రావడం కల్ల అని వైఎస్ షర్మిల తెలిపారు. జగన్ కు తమ ప్రధాన ప్రత్యర్థులు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లను ఎదుర్కొనడం సులువుగానే కనిపిస్తుంది. కానీ కుటుంబం సభ్యులను ఎదుర్కొనడం మాత్రం జగన్ కు బిగ్ టాస్క్ గా మారిందనే చెప్పాలి. జగన్ కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో తనకు ఓట్లు వేస్తారని భావిస్తున్నప్పటికీ సొంత కుటుంబం నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టలేకపోతే, జనం నమ్మే అవకాశాలు తక్కువగానే ఉంటాయన్నది వాస్తవం. అందుకే వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచే జగన్ కు రాజకీయంగా ముప్పు ఉందని చెప్పొచ్చు.





Tags:    

Similar News