TDP : స్థానిక సంస్థలు టీడీపీకి తలనొప్పిగా మారనున్నాయా?

తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు

Update: 2026-01-30 07:51 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే తమకు పదవులు కావాలంటూ ఎమ్మెల్యేలపై వత్తిడి తెస్తున్నారు. ఒకరకంగా స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి, జెండా మోసిన వారికి పదవులు ఇవ్వకుండా రెండేళ్ల పాటు నాన్చారని, ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అవకాశమివ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఎమ్మెల్యేలు కూడా తమపై పెరుగుతున్న వత్తిడి తట్టుకోలేక పార్టీ కేంద్ర నాయకత్వం వైపు ఎక్కువ మంది చూస్తున్నారు.

అన్ని కోణాల్లో చూడటంతో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లో సామాజికవర్గం పరంగా చూస్తారు. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కులాలు, మతాలు అన్నీ బేరీజు వేసుకుని మరీ అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. కానీ నాయకులు మాత్రం స్థానిక ఎన్నికల్లో ఆ కోటాలను అన్నీ పెట్టుకుంటే తాము రాజకీయంగా నష్టపోతామని, మరొక మూడేళ్లు మాత్రమే అధికారంలో ఉండటంతో తమకు అవకాశమివ్వాలని ప్రధాన సమాజికవర్గం నుంచి నేతలు ఒత్తిడి తెస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకూ అన్ని రకాలుగా తమకు మద్దతివ్వాలంటూ ముందు నుంచే ప్రెషర్ పెడుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో...
ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ నేతలపై ఈ వత్తిడి అధికంగా ఉంది. పదవుల షేరింగ్ లో తాము ఎక్కడ కోల్పోతామన్న భయం వారిలో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నారా లోకేశ్ ను, చంద్రబాబు ను కలసి తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. అయితే ఎవరికీ ఎటువంటి హమీలు లభించడం లేదు. మరొకవైపు సోషల్ మీడియాలో సైతం తమ నేతకు మున్సిపల్ పదవి ఇవ్వాలంటూ ఇప్పటి నుంచే పోస్టింగ్ లు కనపడుతుండటంతో వారు ఎంత తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించే అవకాశం ఉండకపోవచ్చు. అందరికీ న్యాయం చేయడం జరగదన్న సంకేతాలు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇస్తున్నప్పటికీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.













Tags:    

Similar News