Andhra Pradesh : ఆటలాడుకోవడానికి ఆపదమొక్కులు వాడే దొరికాడా?
ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీల రాజకీయం రగడగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీల రాజకీయం రగడగా మారింది. అధికార, విపక్ష పార్టీలు ఫ్లెక్సీలతో జనం వద్దకు చేరాలనుకుంటున్నాయి. కానీ నాయకులకు తెలియని దేంటంటే.. ఫ్లెక్సీల్లో వేసినంత మాత్రాన నిజాలు కనుమరుగు కావు. అలాగే నిజాలు అబద్ధాలయిపోవు. ప్రజలు నిశితంగా అన్ని రకాలుగా గమనిస్తున్నారు. సోషల్ మీడియా, టీవీ మాధ్యమాలు వచ్చిన నేటి కాలంలో కేవలం ఫ్లెక్సీలతో రాజకీయం చేయాలనుకుంటే అది అవివేకమే అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ కూడా రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీలు వేసింది. సిద్ధం సభలకు తాము అధికారంలో ఉండగా ఫ్లెక్సీలు వేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినా ఓటమి తప్పలేదు.
కల్తీ నెయ్యి కలిసిందంటూ...
ఇప్పుడు టీడీపీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి లడ్డూలో కలిసిందంటూ టీడీపీ నేతలు రాష్ట్రంలో అనేక చోట్ల ఫ్లెక్సీలు వేశారు. పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. కల్తీ నెయ్యితో తిరుమల భక్తుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఫ్లెక్సీలు వేసి పసుపు పార్టీ తమ్ముళ్లు ప్రచారానికి తెరలేపారు. అయితే సీబీఐ ఛార్జిషీట్ లో నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పిందని, అబద్ధపు ప్రచారం చేయవద్దంటూ వైసీపీ నేతలు ఆ ఫ్లెక్సీలను చించివేస్తున్నారు. దీంతో రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతుంది. గుంటూరులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ ఫ్లెక్సీని తొలగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఆధ్యాత్మిక వాతావరణాన్ని...
అసలు తిరుమల నెయ్యి కల్తీ వివాదాన్ని రాజకీయంగా మలచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తిరుమల ఆధ్మాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తాయని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఏడుకొండల వాడితో ఆటలా? అంటూ చాలా మంది ఇరు పార్టీల నేతల వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. నిజంగా కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి ఉంటే ఆ తిరుమలేశుడే వారికి బుద్ధి చెబుతారని, ఆపద మొక్కుల వాడిని నడిరోడ్డుపైకి ఈడ్చడం ఎంత వరకూ న్యాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తిరుమలేశుడిపై రాజకీయాన్ని మానుకోవాలని, ఏదైనా ఉంటే రాజకీయంగా తేల్చుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఇప్పటికైనా లడ్డూ కల్తీ వివాదాన్ని రోడ్డుపైకి లాగవద్దంటూ పలువురు వేడుకుంటున్నారు.