YSRCP : అక్కడ అభ్యర్థిని ముందుగానే ఫిక్స్ చేసిన జగన్ .. కారణమేంటంటే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ముందుగా కడప జిల్లాలో పట్టు మళ్లీ పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. మొత్తం పది నియోజకవర్గాలుండగా అందులో మూడింటిలోనే విజయం సాధించడం జగన్ పై ఉన్న వ్యతిరేకతకు కారణమయింది. అయితే కడప జిల్లాలో ఓటమికి అనేక కారణాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ఈసారి కొత్త ట్రెండ్ కు తెరలేపుతున్నారు. మైదుకూరు నియోజకవర్గం అంటే తొలి నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీకి బలం ఉన్న ప్రాంతం. అక్కడ ఓటు బ్యాంకు ఎక్కువగా యాంటీ టీడీపీ ఉన్నట్లు అనేక ఫలితాలు వెల్లడించాయి.
అందుకే ఫలితాలు అలా...
అయితే 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం వైసీపీని దెబ్బతీశాయి. ఇందులో మరొక కోణం కూడా ఉంది. అదే సామాజికవర్గం కోణం. మైదుకూరు నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్డి సామాజికవర్గం నేతలే ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తొలిసారి యాదవ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేత పుట్టాసుధాకర్ యాదవ్ కు మైదుకూరు ప్రజలు అండగా నిలిచారు. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే పథ్నాలుగు సార్లు రెడ్డి సామాజికవర్గం నేతలే ఎన్నికయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో రెడ్డి యేతర సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి రికార్డు బ్రేక్ చేశారు. బీసీల్లోనూ యాదవులు ఎక్కువగా ఉండటంతో అక్కడ గెలుపు సాధ్యమయింది.
ఈ సారి టిక్కెట్ మాత్రం...
దీంతో వచ్చే ఎన్నికల్లోనూ జగన్ యాదవ సామాజికవర్గానికి చెందిన నేతకే టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కడప పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి కూడా టిక్కెట్ ఇవ్వకపోడం ఓటమికి కారణంగా జగన్ గుర్తించారు. కడప పట్టణ నియోజకవర్గం మాత్రం ముస్లిం మైనారిటీలకు ఇస్తూ వస్తున్నారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గానికే కేటాయిస్తూ వస్తున్నారు. దీంతో ఈ సారి ఆ విధానాన్ని మార్చి మైదుకూరులో బీసీని పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న రమేష్ యాదవ్ ను ఈసారి మైదుకూరు నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారని తెలిసింది. రమేష్ యాదవ్ సొంత గ్రామం కూడా అదే నియోజకవర్గం పరిధిలో ఉండటంతో ఈ సారి ముందుగానే అక్కడ అభ్యర్థిని జగన్ ఫిక్స్ చేశారని, రమేష్ యాదవ్ కు కూడా చెప్పడంతో ఆయన మైదుకూరు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట.