Telangana : కాంగ్రెస్ కష్టాలు కొని తెచ్చుకుంటుందా.. పెద్దాయనకు నోటీసులు ఇవ్వడం కరెక్టేనా?
మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ అధికారులు బీఆర్ఎస్ కు సానుభూతి తెచ్చేందుకు నడుంకట్టుకున్నట్లు కనిపిస్తుంది.
మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ అధికారులు బీఆర్ఎస్ కు సానుభూతి తెచ్చేందుకు నడుంకట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చివిచారణకు పిలవడం మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ శ్రేణులు ఇదే భయపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు చోటు చేసుకున్న కీలక పరిణామం మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీకి కలసి వచ్చేటట్లు కనిపిస్తుంది. అరవై ఐదేళ్ల వయసులో పెద్దాయనను విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం పై కాంగ్రెస్ నేతలే లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో చేయాల్సిన పని ఇదా? అంటూ కొందరయితే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
రెండేళ్ల నుంచి...
ఎంత లేదన్నా కేసీఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తిగా నేటికీ ప్రజల్లో చెరగని ముద్ర ఉంది. ఆయన అవినీతి, ఆరోపణలు గత రెండేళ్ల నుంచి ఏ మాత్రం నిరూపించలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఏంటన్న ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతుందంటున్నారు. కాళేశ్వరంలో కోట్ల రూపాయలు అవినీతిజరిగిందని ఆరోపణలు చేసి.. కొన్ని నెలల పాటు కమిషన్ తో కాలం గడిపి, తర్వాత నింపాదిగా సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పేయడంతోనే అందులో డొల్లతనం బయటపడిందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాళేశ్వరం అవినీతిని తేల్చలేని వాళ్లు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సాధించిందేమటన్న ప్రశ్నను బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో...
ఒకరకంగా పెద్దాయనను ఇలా విచారణ పేరిట వేధించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టమే కాని, ఎటువంటి ప్రయోజనాలు ఉండవన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. రేపు ఆయన ఇంట్లో విచారణ చేసినా బీఆర్ఎస్ నేతలు చేసే హడావిడితో కొంత సానుభూతి ఆ పార్టీకి వస్తుందని, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇది అవసరమా? అన్న ప్రశ్న కూడా కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల నుంచి వినిపిస్తుంది. బీజేపీ నేతలు చెబుతున్నట్లు ఇందులో సిట్ అధికారుల కానీ, ప్రభుత్వం కానీ సాధించిందేమీ ఉండదని, కాలయాపన కోసమే ఇటువంటి నోటీసులు ఇవ్వడం, పార్టీకి నష్టంకొని తెచ్చుకోవడం ఎందుకని ప్రశనిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ ను రేపు విచారించినా తేలేది ఏముంటుందో తెలియదు కానీ.. మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ తగలడం ఖాయమన్న వ్యాఖ్యలు గాంధీ భవన్ నుంచే వినిపిస్తుండటం విశేషం.