Mangalagiri : ఆర్కే మళ్లీ వైసీపీలోకి.. నేడు జగన్ ను కలిసే అవకాశం

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి రానున్నారు. ఆయన ఈరోజు జగన్ ను కలిసే అవకాశముంది

Update: 2024-02-20 04:18 GMT

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి రానున్నారు. ఆయన ఈరోజు జగన్ ను కలిసే అవకాశముంది. ఈ మేరకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కలసి ఆళ్ల రామకృష్ణారెడ్డి మరికాసేపట్లో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారని తెలిసింది. ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకు రావాలని అయోధ్య రామిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెబుతున్నారు. ఆర్కే తిరిగి వస్తే మంగళగిరిలో వైసీపీ మరింత బలంగా మారుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

రెండుసార్లు గెలిచి....
ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో జగన్ కు ఆయన చోటు కల్పించలేదు. దీంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. కానీ కొన్నాళ్ల క్రితం గంజి చిరంజీవిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ లో చేరి...
ఆర్కే రాజీనామా చేయడంతో ఆయనతో పాటు అనుచరులు కూడా రాజీనామా చేశారు. అయితే ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులు కావడంతో ఆమె వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. పార్టీ కండువా కప్పేసుకున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని భావించడం ఒక కారణమయితే.. జగన్ పార్టీ నుంచి కూడా ఆర్కేకు రాయబారం నడిచినట్లు తెలిసింది. ఆయన సోదరుడు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆర్కేను బుజ్జగించడలో సక్సెస్ అయ్యారంటున్నారు.
పార్టీలో చేరితే...?
మళ్లీ పార్టీలో చేరితే మంగళగిరి సీటు కాకుండా మరో కీలక పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయినట్లు సమాచారం. దీంతోనే ఆర్కే తిరిగి వైసీపీలోకి మళ్లీ వచ్చేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈరోజు జగన్ ను కలిసిన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత రానుంది. ఆర్కే రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. అందుకే ఆయన ఎమ్మెల్యే హోదాలోనే మళ్లీ వైసీపీలో చేరతారని తెలిసింది. ఆర్కే తిరిగి వైసీపీలోకి వస్తే నారా లోకేష్ ను ఈసారి కూడా సులువుగా ఓడించవచ్చన్న వైసీపీ ఆలోచన ఏ మేరకు సఫలీకృతం అవుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News