KTR : మీ నాయనే బాగుంటే.. సవ్యంగా చేసి ఉంటే.. ఓటమి దక్కి ఉండేదా కేటీఆర్?

మాజీ మంత్రి కేటీఆర్ ఎందుకో ఈ మధ్య కొంత మాటలు పట్టుతప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కనపడుతుంది

Update: 2024-01-25 06:40 GMT

మాజీ మంత్రి కేటీఆర్ ఎందుకో ఈ మధ్య కొంత మాటలు పట్టుతప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కనపడుతుంది. ఎన్నడూ లేనిది కేటీఆర్ మాట తూలుతుండటంతో బీఆర్ఎస్ నేతలనే ఆశ్చర్యపరుస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొంత హుందాగా వ్యవహరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత జరుగుతున్న పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాల్లో మాత్రం కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎమ్మెల్యేలో.. మరొకరో మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు.. కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలవడానికి క్యాడర్ లో జోష్ నింపడానికి మరొక రకమైన దారులున్నాయి. ముందు క్యాడర్ కు అందుబాటులో ఉంటే ఆ తర్వాత విజయాలు వస్తాయి. అంతే తప్ప అదుపు తప్పి మాట్లాడితే అసలుకే చేటు వస్తుందంటున్నారు.

ఎలా అవుతారు?
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు కూడా తప్పుపడుతున్నారు. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏక్‌నాధ్ షిండేతో పోల్చడం కూడా సరికాదని అంటున్నారు. ఓటమి పాలయి కేవలం నెలన్నర కూడా కాలేదు. అప్పుడే అధికార మార్పిడి జరగాలని కోరుకోవడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయవచ్చు. అందులో తప్పులేదు. అంతే కాని ఉన్న ప్రభుత్వం కూలిపోయి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా త్వరలో వస్తారని అనడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
పదేళ్లు అధికారం ఇచ్చినా...
బీఆర్ఎస్ కు పదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారు. పదేళ్ల పాటు పాలనను చూసిన ప్రజలు గత ఎన్నికల్లో తీర్పు చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన కేటీఆర్ ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడటం ఆయన మనసులో ఉన్న భావాలను బయటపెడుతున్నట్లుగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం తమ సొంత జాగీరు అనుకుని, ఓటమి అనేది తమకు ఉండదని భావించి గెలుపు దక్కకపోతేనే ఇలా జరుగుతుందని అనుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ ఒక అనామకుడి చేతిలో ఓడిపోయారని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే గెలిచిన ఎమ్మెల్యే అనామకుడా? కామారెడ్డిలో ఓటమికి కారణాలు వెతుక్కోవాలి కానీ గెలిచిన, జనం ఎన్నుకున్న ఎమ్మెల్యేను అనామకుడని సంభోదించడం సరికాదన్నారు.
ఓటమికి గల కారణాలు...
కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు ఓటమి పాలయ్యారో అందుకు కారణాలు వెతకాలి. దానిని సరిచేసుకోవాలి. నాయనే బాగుంటే.. ఇదంతా ఎందుకన్నట్లు? కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే కదా? ఈ ఓటమి అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఎవరినీ కలవకపోవడం, నియంతగా వ్యవహరించడం వంటి వాటివల్లనే పార్టీ ఓటమికి ఒక కారణమని చెబుతున్నారు. పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయంలో గెలిచిన వారికి సుద్దులు చెబుతూ, వారిపై నిందలు వేయడం సరికాదన్నది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం మీద కేటీఆర్ గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. హుందాగా అందరికీ ఆదర్శంగా మొన్నటి వరకూ కనిపించే కేటీఆర్ నేడు తరచూ నోరు జారుతూ నవ్వుల పాలవుతున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తన పంథాను మార్చుకోవాలన్న కామెంట్స్ నెట్టింట వినపడుతున్నాయి.


Tags:    

Similar News