TDP : నోటికి తాళం వేసుకున్నారా.. పదవులుంటేనే పెదవి విప్పుతారా?
తెలుగుదేశం పార్టీ వాయిస్ లేక ఇబ్బందులు పడుతుంది
తెలుగుదేశం పార్టీ వాయిస్ లేక ఇబ్బందులు పడుతుంది. అందుకు ప్రధాన కారణం సీనియర్ నేతలు మౌనం పాటించడమే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీడీపీ సీనియర్ నేతలు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతుంది. గత ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కని వారు. మంత్రిపదవులు లభించని వారు.. నామినేటెడ్ పదవులు దక్కని సీనియర్ నేతలు పార్టీకి అండగా ముందుకు రాకపోవడం ఒకింత ఆందోళన కలిగించే అంశమే. ఏ విషయంలోనూ వారు పెదవి విప్పక పోవడంతో వారి మనసుల్లో ఎంత అసంతృప్తి ఉందన్నది చెప్పకనే తెలుస్తుంది. సీనియర్లను ఇక పట్టించుకోరన్న భావన వారిలో కలిగినట్లుంది.
తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ...
తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ సీనియర్ నేతలు మౌనంగానే ఉన్నారు. గతంలో ఒక విమర్శ వస్తే వెంటనే విరుచుకుపడే నేతలు మాత్రం ఇప్పుడు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ వైసీపీ నేతలు పెద్దయెత్తున మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడినప్పటికీ సీనియర్ నేతలు మాత్రం పెదవి విప్పలేదు. కనీసం తిరుమల లడ్డూ వ్యవహారంపై మీడియా సమావేశాన్ని పెట్టి వివరించే ప్రయత్నం కూడా సీనియర్ నేతలు చేయలేదంటే దాన్ని బట్టి వారు పార్టీ కార్యక్రమాలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థమవుతుంది.
వ్యక్తిగత దూషణలు చేసినా...
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దూషణలు చేసినా ఎవరూ ముందుకు వచ్చి ఖండించకపోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది. చంద్రబాబుకు ఈ పరిస్థితి అర్థమయి ఉండవచ్చు. మంత్రులు, కొందరు నేతలు వెంటనే స్పందిస్తున్నప్పటికీ సీనియర్ నేతలు స్పందించే తీరు వేరే విధంగా ఉంటుంది. వారికి ఉన్న రాజకీయ అనుభవం కావచ్చు. విమర్శల దాడి చేయవచ్చు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ ఖండించలేదు. అంబటి వ్యాఖ్యలు ఆ తర్వాత జరిగిన దాడులతో కనుమరుగయ్యాయి. అయినా సరే అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పాపాన పోలేదు. పదవులు లేవన్న అక్కసుతోనే తమ నోటికి తాళం వేసుకునట్లు కనపడుతుంది. ఇది పార్టీలోనూ చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.