Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు టెన్షన్.. మున్సిపల్ ఎన్నికలు ముప్పు తెస్తాయా?
తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి
తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుచుకుని తీరి రావాల్సి ఉంది. ఈ ఫలితాలు ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసే అవకాశం పార్టీకి నాయకత్వానికి లభిస్తుంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. బీఫారం దక్కని అభ్యర్థులుఅసంతృప్తితో ఉన్నారు. వారు అనేక చోట్ల ఆందోళనలకు కూడా దిగుతున్నారు. వారిని బుజ్జగించి పార్టీ కోసం పనిచేయించడం ఒక రకంగా తలకు మించిన భారంగానే చూడాలి.
పార్టీ మారిన నియోజకవర్గాల్లో...
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గద్వాల్, జగిత్యాల వంటి నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అక్కడి కాంగ్రెస్ ఇన్ ఛార్జులకు అభ్యర్థుల ఎంపికపై విభేదాలు తలెత్తాయి. జగిత్యాలలో అయితే ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్గానికి ముప్ఫయి వార్డులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇరవై వార్డులు ఇచ్చాయి. మధ్యే మార్గంగా సర్దుకుపోవాలని చెప్పినా అందుకు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. దీంతో కొందరు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తుండగా, మరికొందరు బీజేపీ, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.
ఉప సంహరణ గడువు ముగియడంతో...
అధికార పార్టీలోనే ఈ రెబల్స్ తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువుముగియడంతో స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి బరిలోకి దిగిన వారు పోటీ నుంచితప్పుకోవడానికి ససేమిరా అంటున్నారు. ఇది నేతలకు తలనొప్పిగా మారింది. మరొకవైపు గుర్తులు కేటాయించిన తర్వాత వారు ప్రచారంలోకి దిగితే ఓట్లు చీలిపోయి ఓటమికి కారణమవుతుందన్న భయం నేతల్లో కనపడుతుంది. పదవుల హామీలు ఇస్తున్నప్పటికీ చాలా మంది ఇంకా రెబల్స్ రంగంలోనే ఉన్నారు. అనేక చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు ఉండటంతో ఓట్ల చీలిక కాంగ్రెస్ ను ఎటు వైపు నడిపిస్తుందన్నది వేచి చూడాలి. మొత్తం మీద దాదాపు ఎక్కువ నియోజకవర్గాల్లో అసంతృప్తుల బెడద ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.