రేవంత్ రెడ్డిని సీఎం చేసే బ్ర‌హ్మాస్త్రం ఇదేనా ?

రానున్న నెల రోజుల పాటు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌కు టీ కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌జ‌ల్లోకి

Update: 2022-05-17 04:33 GMT

హైదరాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల్లో స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతో ముందుకెళుతున్నారు పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి. కేసీఆర్‌ను గ‌ద్దె దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాల‌నేది ఆయ‌న ల‌క్ష్యం. ఈ దిశ‌గా చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. త‌న వ్యూహాల‌తో పాటు ఓ వ్యూహ‌క‌ర్త‌ను కూడా నియ‌మించుకొని ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. ఇటీవ‌లి వ‌రంగ‌ల్ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌పైన రేవంత్ రెడ్డి చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీని గెలిపించే బ్ర‌హ్మాస్త్రం అవుతుంద‌నేది ఆయ‌న న‌మ్మ‌కం.

రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డంలో రైతుల‌దే కీల‌క పాత్ర‌. రైతుబంధు ప‌థ‌కం ప‌ట్ల అప్పుడు సంతృప్తిగా ఉన్న రైతులు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ‌గా మ‌ద్ద‌తు ఇచ్చారు. అయితే, ఇప్పుడు మాత్రం రైతుల్లో ప్ర‌భుత్వంపైన అసంతృప్తి ఉంద‌నేది రేవంత్ రెడ్డి అంచ‌నా. ముఖ్యంగా ధ‌ర‌ణి వెబ్‌సైట్ వ‌ల్ల రైతులు చాలా భూస‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, వ‌రి వేయొద్ద‌ని ఓసారి, వేస్తే కొన‌మ‌ని మ‌రోసారి, కేంద్ర‌మే కొనాల‌ని ఇంకోసారి, ఇలా రైతుల్లో అయోమ‌య ప‌రిస్థితుల‌కు ప్ర‌భుత్వం కార‌ణ‌మైంది.
ఇక‌, రుణ‌మాఫీ హామీని నెర‌వేర్చామ‌ని టీఆర్ఎస్ చెబుతున్నా అది వ‌డ్డీల‌కే స‌రిపోయింద‌ని, రుణ‌భారం మాత్రం త‌ప్ప‌లేద‌ని రైతులు భావిస్తున్నార‌నేది కాంగ్రెస్ ఆలోచ‌న. కాబ‌ట్టి, రైతుల్లో క్ర‌మంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపైన వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని భావిస్తున్న రేవంత్ రెడ్డి... దీనిని త‌మ పార్టీకి అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే చాలా హామీల‌తో రైతుల కోసం వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు.
రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ, ఎక‌రానికి రూ.15 వేల పెట్టుబ‌డి సాయం, ధ‌ర‌ణి వెబ్‌సైట్ ర‌ద్దు వంటి భారీ హామీల‌తో పాటు ఏ పంట‌కు ఎంత మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామో కూడా ఈ డిక్ల‌రేష‌న్‌లో ప్ర‌క‌టించింది కాంగ్రెస్ పార్టీ. ఈ హామీలు ఎంత‌వ‌ర‌కు ఆచ‌ర‌ణ‌సాధ్య‌మ‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ క‌నుక‌ రైతుల్లోకి వెళ్లి వారిలో చ‌ర్చ జ‌రిగితే క‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంది.
అందుకే, రానున్న నెల రోజుల పాటు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌కు టీ కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే ల‌క్ష్యంగా ఈ నెల 21వ తేదీ నుంచి రైతు ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తోంది. మొత్తం రాష్ట్ర‌వ్యాప్తంగా 400 మంది కాంగ్రెస్ నేత‌లు నెల రోజుల పాటు గ్రామాల్లోనే ఉండేలా ఈ కార్య‌క్ర‌మానికి రేవంత్ రెడ్డి రూప‌క‌ల్ప‌న చేశారు. క‌ర‌ప‌త్రాలు, చాటింపుల ద్వారా ఈ డిక్ల‌రేష‌న్‌ను రైతుల్లోకి తీసుకెళ్ల‌నున్నారు. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ అనేది త‌మ‌ను అధికారంలోకి తీసుకువ‌స్తుంద‌ని రేవంత్ రెడ్డి న‌మ్ముతున్నారు. అందుకే, దీనికి ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, దీనికి గురించి రైతుల్లో చ‌ర్చ జ‌రుగుతూ ఉండాల‌నేది రేవంత్ రెడ్డి స్కెచ్‌గా క‌నిపిస్తోంది.


Tags:    

Similar News