గేమ్‌ మొదలైంది.. గోల్‌ కొట్టేదెవరు..!

తెలుగు పోస్ట్‌ సోమవారం చెప్పినట్లుగా భాజపా, తెలుగుదేశం పొత్తులు దాదాపు ఖరారు అయినట్లే! ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వవని ముందు నుంచి చెబుతున్న జనసేన ఈ సంకీర్ణంలో భాగస్వామిగా ఉంటుంది. వ్యూహాలు అన్నీ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు కీలకం కానున్నాయి.

Update: 2023-06-13 03:36 GMT

  తెలుగు పోస్ట్‌ సోమవారం చెప్పినట్లుగా భాజపా, తెలుగుదేశం పొత్తులు దాదాపు ఖరారు అయినట్లే! ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వవని ముందు నుంచి చెబుతున్న జనసేన ఈ సంకీర్ణంలో భాగస్వామిగా ఉంటుంది. భాజపా కాన్సట్రేషన్‌ అంతా పార్లమెంట్‌ స్థానాల మీద ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఆ పార్టీ నాయకులకు లేదు. జిల్లా స్థాయిలో చెప్పుకోదగ్గ నాయకులే లేని పార్టీ ఆంధ్రను దక్కించుకుంటామనే సొంత కార్యకర్తలే నమ్మరు. కర్నాటక ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటే భాజపా గేమ్‌ ప్లాన్‌ మరోలా ఉండేది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని వాళ్లు కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతున్నారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా ఈ సారి మూడు వందల స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు. అంటే 2019 స్థాయిలో కూడా సీట్లు గెలవలేమని ఆయనకు అర్థం అయినట్లుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలే కీలకం 

ఈ ఏడాది హిందీ హార్ట్‌ల్యాండ్‌తో పాటు తెలంగాణతో కలిపి 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి ప్రభావం లోక్‌సభ ఎన్నికల మీద ఖచ్చితంగా పడుతుంది. రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కానీ అధికారంలోకి వస్తే బీజేపీ లోక్‌సభ సీట్లకు భారీగా గండి పడుతుంది. మోదీ ఛరిష్మా ఇంకా ఎంతకాలం పని చేస్తుందో చెప్పలేం. పదేళ్లు అయిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత పెరుగడం సహజం. ఇక హిందుత్వవాదం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, అవినీతి రహిత పాలన ఇలాంటివన్నీ బీజేపీకి కేంద్రంలో అధికారాన్ని సాధించిపెట్టకపోవచ్చు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ దాదాపు 20 ర్యాలీలు, 6 రోడ్‌ షోలలో పాల్గొన్నారు. అయినా ఆ పార్టీ ఓటమి మూటగట్టుకుంది. అన్ని అభివృద్ధి పనుల్లో భాజపా ‘నలభై శాతం’ కమిషన్‌ తీసుకుంటుందని ఆరోపణలు రావడం, స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కొడుకు నలభై లక్షల కమిషన్‌ తీసుకుంటూ దొరికిపోవడం కూడా భాజపాక మైనస్‌ అయింది. అవినీతి ఒక్కటే ప్రధానాంశం కాదు. ప్రస్తుత డిప్యూట్‌ సీఎం డి.శివకుమార్‌ మీద అవినీతి ఆరోపణలపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. అధికారం కోసం ఎందాకా అయినా తెగించడం, పదేళ్ల పాటు ఏకధాటిగా పాలించడం వల్ల మూట కట్టుకున్న అవినీతి కమలం పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు. 

ఈ ఓటమి ఓ గుణపాఠం 

కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో భాజపాకు భయం మొదలైంది. అందివచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని ఆశ ఆ పార్టీకి లేకపోయినా, తెలంగాణ మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్‌ పునరుజ్జీవం హస్తం పార్టీలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఒక్కసారిగా రాహుల్‌, ప్రియాంక యాక్టివ్‌ అయ్యారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఎలాంటి ప్రకటనలూ చేయకపోయినా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ పెద్దలు. రెండు రోజుల తీవ్ర ఆరోపణల తర్వాత జగన్మోహన్‌రెడ్డి కూడా స్పందించారు. బీజేపీ మద్దతు తనకు లేకపోయినా ఫర్వాలేదని సోమవారం విద్యాకానుక కార్యక్రమంలో కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇటీవల విభజన లోటు కింద పదివేల కోట్లు, పోలవరం ఖర్చుల రీఇంబర్స్‌మెంట్‌ కింద 13 వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. భాజపా సంకీర్ణం రాబోయే రోజుల్లో నిధుల విడుదలను ఖచ్చితంగా తన ప్రచారంలో వాడుకుంటుంది.

ఈ సారి సొంతంగా మెజారిటీ కష్టమే!

దేశంలో చాలావరకు పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలతో కునారిల్లుతున్నాయి. బీజేపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది. 1984లో కేవలం 2 లోక్‌సభ సీట్ల నుంచి 303 సీట్లు సాధించి స్వయంగా అధికారం చేపట్టే స్థాయికి ఎదిగింది. ఆరెస్సెస్‌ లాంటి సిద్ధాంతకర్తలతో పాటు బీజేపీ వ్యూహాలు దీనికి ఉపకరించాయి. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఓ కూటమిగా మారినా, అధికారం సాధిస్తామన్న ఆశ వాటికి లేదు. బీజేపీకి కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ (273 లోక్‌సభ సీట్లు) వస్తుందన్న ధీమా లేదు. అందువల్లే తెలుగుదేశంతో పొత్తుకు భాజపా సిద్ధమైంది. 2019లో తమని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన చంద్రబాబును ఇంతవరకూ కన్నెత్తి చూడని కమలనాధులు, వ్యూహం మార్చారు. రెండు పడవల మీద ప్రయాణం మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలిస్తే, ఆ పార్టీతో ప్రయాణం కొనసాగుతుంది. అదే జగన్‌ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిస్తే వైకాపా సహాయం తీసుకోవచ్చు. దానికోసం సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగింవచ్చు. సిబిఐ, ఈడీ ఉండనే ఉన్నాయి. 

గోల్ కొట్టేది ఎవరో 

అందుకే మొన్నటి వరకూ జగన్‌ ప్రభుత్వంతో స్నేహంగా ఉన్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు వైపాకాపై విమర్మల దాటి మొదలు పెట్టారు. అవన్నీ గత నాలుగేళ్లుగా ప్రతిపక్షాలు, పత్రికలు చేస్తున్న ఆరోపణలే. జగన్‌ మాత్రం కేంద్రంపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదు. అలా 2019లో బీజేపీని నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు తర్వాత వాళ్ల ప్రాపకం కోసం ఎంతలా తపించారో అందరికీ తెలుసు. అందుకే జగన్‌ కూడా బీజేపీతో సాఫ్ట్‌ గానే ఉంటున్నారు. బీజేపీ విమర్శలు పెరిగితే వైకాపా రాష్ట్రస్థాయి నాయకులు, మంత్రులు రంగంలోకి దిగుతారు. తీవ్ర విమర్శలు చేస్తారు. జగన్ చేతికి మట్టి అంటదు. 2024 ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో జగన్‌ ఉన్నారు. అందుకే కేంద్ర పెద్దలతో, జాతీయ పార్టీలతో పంచాయతీలకు ఆయన సిద్ధంగా లేరు. ఇలా ఎవరి గేమ్‌ వాళ్లు ఆడుతున్నారు. చివరకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో గోల్‌ కొట్టేదెవరో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు నిర్ణయిస్తాయి.

Tags:    

Similar News