TDP : కేశినేని వర్సెస్ కొలికపూడి.. ఇద్దరూ ఆగేట్లు లేరుగా?

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య మరోసారి రగడ మొదలయింది.

Update: 2026-03-03 07:04 GMT

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య మరోసారి రగడ మొదలయింది. దేవుడి ముందే చిల్లర తగవు పడటం మరింతగా ఇద్దరూ రాజకీయంగా దూరమయినట్లేనని చెబుతున్నారు. స్వామి వారికి సమర్పించే పట్టువస్త్రాలను అవమానించే విధంగా ప్రవర్తించారని ఇరు వర్గాలు ఆరోపించుకుంటున్నాయి. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి.. ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం రేగింది. గంపలగూడెంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు ఎవరు సమర్పించాలనే విషయంలో వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం.. తోపులాటజరగడంతో పోలీసులు సర్ది చెప్పి పంపాల్సి వచ్చింది.

పట్టు వస్త్రాలను సమర్పించేందుకు...
ఎంపీ కేశినేని చిన్ని పట్టువస్త్రాలు సమర్పించడానికి ప్రయత్నించగా అతని తలపై ఉన్న వస్త్రాలను కొలికపూడి శ్రీనివాసరావు లాక్కున్నారు. ఇద్దరి వ్యవహారంపై అర్చకులు సహా భక్తుల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు గౌరవమైన పదవులలో ఉండి ఆలయంలో ఇవేం చిల్లర వేషాలు అంటూ భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారికి ఎవరో ఒకరు పట్టు వస్త్రాలు సమర్పించాలి కానీ, అక్కడ కూడా ఆధిపత్యం, రాజకీయాలు చేస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చిల్లర తగాదాలతో ఇద్దరూ ప్రజల్లో పలుచన అవుతున్నారన్న భావన వ్యక్తమవుతుంది. ఇరువురు ఒకేసారి ఆలయంలోకి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రెండు వర్గాలకు చెందిన నేతలు తోపులాటలు ఆలయంలో చోటు చేసుకోవడం దురదృష్టకరమని అంటున్నారు.
అధిష్టానానికి తలనొప్పిగా...
టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా ఇద్దరి వ్యవహారం మారింది. గతంలో అనేక సార్లు వీరిద్దరి మధ్య వివాదానికి చెక్ పెట్టాలని ప్రయత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. చంద్రబాబు హెచ్చరించినా ఫలితం లేదు. చంద్రబాబు మాత్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వీరిద్దరి విషయంలో ఏమీ చేయలేక పోతుందని సొంత పార్టీ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరువురు నేతలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసుకోవడంతో పార్టీ పరువు బజారున పడింది. ఇప్పుడు ఏకంగా ఆలయంలోనే ఘర్షణకు దిగడంతో ఇక తిరువూరు యుద్ధంలో ఏదో నిర్ణయం తీసుకోకపోతే పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News