Telangana : రేవంత్ కాంగ్రెస్ లో సక్సెస్ కావడానికి ఇదే కారణమా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి, అధినాయకత్వానికి దూరం పెరిగిందన్న ప్రచారం ఒట్టిదేనని రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికతో స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీలో తన మాటకు ఎదురు లేదని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ దూరం పాటిస్తున్నారని, హైకమాండ్ పక్కన పెట్టేసిందని ప్రత్యర్థులు చేస్తున్న వాదనలు దాదాపు వీగిపోయాయి. తన చిరకాల స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయించడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. ఎందరో ఆశావహులున్నా, సీనియర్ నేతలను కాదని, హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఇచ్చిందంటే ఆయన తన స్థానాన్నిఎంతగా పార్టీలో పదిలపర్చుకున్నారో అర్థమవుతుంది.
చాలాకాలం నుంచి...
నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా కాలం నుంచి రేవంత్ రెడ్డి ఆధిపత్యమే నడుస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి తో రాజీపడక తప్పని పరిస్థితి నెలకొంది. అంతేకాదు గత కొంత కాలం నుంచి పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు లేవని,దూరం పెట్టిందని అనేకమంది ప్రచారాలు చేశారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో అనేక మంది పోటీ పడ్డారు. పార్టీ సీనియర్ నేతలు వి. హనుమంతరావు, జీవన్ రెడ్డి, కుసుమ కుమార్ లాంటి వాళ్ళు ఈ ఒక్క సీటు కోసం రేసులో ఉన్నా సరే, అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే అధినాయకత్వం మొగ్గుచూపింది. ఢిల్లీకి వెళ్లి కూర్చుని మరీ రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నారకు.
సరైన నాయకత్వం వైపు...
పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించడం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిందంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీకి అవసరమని కూడా హైకమాండ్ గుర్తించింది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ఆ మాత్రం గౌరవం ఇస్తే తప్పేముందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే సీనియర్లకు ఒకింత బాధ కలగడం సహజమే. ఈ పోటీ రాజకీయంలో సీనియర్ నేతలు తట్టుకోలేరు. అన్నింటికీ సిద్ధపడ్డ వారు మాత్రమే రాజకీయాల్లో రాణించగలరని రేవంత్ రెడ్డి నిరూపించారు. అందుకే తన సన్నిహితుడిని పెద్దల సభకుపంపి ప్రత్యర్థులకు గట్టి సంకేతాలను బలంగా పంపగలిగారు.
ఢిల్లీలో తనకంటూ...
దీంతో పాటు ఢిల్లీలో తనకంటూ ఒక నమ్మకమైన వ్యక్తి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి స్నేహం కొనసాగుతుంది. అనేక సమయాల్లో, అనేక విషయాల్లో రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వానికి అవసరమైన పనులు త్వరిత గతిన చేసేందుకు తన మనిషి ఉండాలని ఈ నిర్ణయం తీసుకుని నరేందర్ రెడ్డి కే రాజ్యసభ సీటును దక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలోనే కాదు పార్టీ లోనూ తనదే పైచేయి అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలను తిప్పికొట్టి ఢిల్లీలో తన మిత్రుడిని పంపి, తనకు సహాయ సహకారాలు అందించేందుకు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ఉపయోగించు కున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే పార్టీలోనూ రైజింగ్ రేవంత్ అని అనాల్సి ఉంటుంది.