Ys Jagan : వైసీపీలో ఆధిపత్య పోరు.. జగన్ చుట్టూ మళ్లీ కోటరీ అలుముకుంటుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆధిపత్యం మొదలయింది

Update: 2026-03-04 08:58 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆధిపత్యం మొదలయింది. జగన్ కోటరీలో చేరేందుకు ప్రయత్నాలు నేతలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ కు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే సజ్జలకు చెక్ పెట్టేందుకు మరొక నేత తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి స్థానంలో తాను చేరిపోవడానికి పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలే అనుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సర్వే నివేదికల వల్లనే పార్టీ ఓటమి పాలయిందని పార్టీలోని కొందరు సీనియర్ నేతలే అంటున్నారు.

జైలు నుంచి వచ్చిన తర్వాత...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల మద్యం కుంభకోణం కేసులో కొన్ని నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి యాక్టివ్ అయ్యారని అంటున్నారు. చంద్రగిరిలో వచ్చే ఎన్నికల నుంచి తన కుమారుడినే పోటీ చేయించి తాను జగన్ వద్ద ఉండాలని చెవిరెడ్డి భావిస్తున్నారని తెలిసింది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి కి పోటీగా చెవిరెడ్డి రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోనే మకాం వేసి, జగన్‌కు అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతున్నారు.
చెవిరెడ్డి వర్సెస్ సజ్జల...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జగన్ తో ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని, జగన్ ఇమేజ్ గ్రాఫ్ పైకి వెళ్తోందని ఆయన నివేదికలు ఇస్తున్నారని మళ్లీ చెబుతున్నారట. అయితే ఏదైనా తన మాటే నెగ్గాలనుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం చెవిరెడ్డి వ్యూహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కూడా సజ్జల కంటే చెవిరెడ్డి రిపోర్టులకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తాడేపల్లిలో సజ్జల మాటే వేదంగా ఉండేది. కానీ ఇప్పుడు చెవిరెడ్డి రాకతో సీన్ మారింది. ఆధిపత్యం విషయంలో ఈ ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ బయటకు వచ్చే ముందు ఇచ్చే నివేదికలు, సోషల్ మీడియా నెరేటివ్‌ల విషయంలో చెవిరెడ్డి పెత్తనం పెరిగిందని, దీంతో సజ్జల కొంత అసహనంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా తిరిగి జగన్ చుట్టూ కోటరీ చేరుతుందా? అన్న అనుమానాలు బయలుదేరాయి.


Tags:    

Similar News