Telangana : రాజ్యభ అభ్యర్థుల పేర్లు ఖరారయినట్లేనా? అదే జరిగితే?
తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు.
తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరు అభ్యర్థులనేది ఇంకా పార్టీ హైకమాండ్ నిర్ణయించలేదు. ఈరోజు వికారాబాద్ తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి వచ్చిన కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. అయితే చర్చించి త్వరలోనే నిర్ణయాన్నివెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం. రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆశావాదులు ఎక్కువగా ఉన్నారు. తమకు అవకాశం కల్పించాని కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని చాలా మంది ఇప్పటికే రాహుల్ గాంధీ దృష్టికి పార్టీ హైకమాండ్ నేతల వద్దకు తీసుకెళ్లారు.
ఆశావహులు అనేక మంది...
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కుసుమకుమార్ పేర్లను పరిశీలించాని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరారు. అయితే అందరం కూర్చుని చర్చించిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు వి. హన్మంతరావు, అనిల్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ, జీవన్‌రెడ్డి, నేరెళ్ల శారద ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా సీనియర్ నేతలకు అవకాశం దక్కడం కష్టమేనని అంటున్నారు. సీనియర్ నేతలకు ఈసారి కూడా మొండి చేయి తప్పదని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడి, జెండాను వదలకుండా దశాబ్దాలుగా ఉన్న తనకు అవకాశం కల్పించాలని వి.హనుమంతరావు కోరుతున్నారు.
రెండు సీట్లలో....
అయితే తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలలో ఒక సీటుకు రాష్ట్రంతో సంబంధం లేని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరు మరోసారి దాదాపు ఖరారయినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కేసులను సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఆయనకు మరోసారి అవకాశం కల్పించనున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రెండు సీటును తన సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డికి ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ స్వయంగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంశీచంద్‌రెడ్డి పేరును సూచించారని సమాచారం. అయినా సరే వేం నరేందర్‌రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని రేవంత్ రెడ్డి చివర వరకూ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అంతా ఒకే అనుకుంటే వేం నరేందర్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ మధ్యలోనే రాజ్యసభ సీట్లు దక్కే అవకాశముందని తెలిసింది. ఈసారి కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలకు మాత్రం అవకాశం లేనట్లేనని అంటున్నారు. మరి చూడాలి చివరికి నిర్ణయం ఎలా ఉంటుందో.