Ys Sharmila : వైఎస్ షర్మిలకు పార్టీ హైకమాండ్ షాకివ్వనుందా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు పార్టీ నాయకత్వం త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు పార్టీ నాయకత్వం త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆమెను పదవి నుంచి తొలగించాలని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. ఆమె స్థానంలో సీనియర్ నేత పల్లంరాజుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా వైఎస్ షర్మిల పనితీరుపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. తన పర్సనల్ అజెండాను తీసుకు వచ్చి ఏపీ రాజకీయాలకు ముడిపెడుతున్నారని, అదిపార్టీకి ఎంత మాత్రం ఉపయోగ పడటం లేదని ఇప్పటికే కొందరు నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అధికార పార్టీని వదిలేసి, ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడంతో పార్టీలో కొద్దో గొప్పో ఉన్న నేతలు కూడా షర్మిల పర్యటనలకు దూరంగా ఉంటున్నారు.
హైకమాండ్ కు ఫిర్యాదు...
ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు ఈ విషయంపై పార్టీ సీనియర్ నేతలు కొందరు వైఎస్ షర్మిల తీరును గురించి చెప్పినట్లు సమాచారం. వైఎస్ షర్మిల ఇప్పటికే పీసీసీ చీఫ్ గా నియమితులయి రెండేళ్లు కావస్తుంది. గత ఎన్నికలకు ముందు ఆమెను పీసీసీ చీఫ్ గా నియమించారు. అయినా సరే కాంగ్రెస్ ఓటు బ్యాంకులో ఎలాంటి మార్పు రాకపోవడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ అధినేతగా జగన్ ఉండటంతో మరొకవైపు వైఎస్ కుటుంబానికి చెందిన వారిని పార్టీ చీఫ్ గా ఉంచితే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని కూడా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుందన్న టాక్ హస్తినలో జోరుగా వినపడుతుంది. అదే సమయంలో వైఎస్ షర్మిలను తప్పిస్తే ఆమెకు కేంద్ర స్థాయిలో పార్టీలో పదవి ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.
గత కొంతకాలంగా దూరంగా...
వైఎస్ షర్మిల పనితీరు నచ్చని సీనియర్లు గత రెండేళ్ల నుంచి పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆమె తాను అనుకున్నదే చేస్తున్నారు తప్పించి, ప్రజాసమస్యలపై పోరాటం చేయకుండా కేవలం జగన్ పై విమర్శలతో సరిపెడితే చంద్రబాబుకు బి టీమ్ గానే కాంగ్రెస్ ను చూస్తున్నారని, చంద్రబాబు మాత్రం బీజేపీతో కలసి నడుస్తున్నారని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కూడా ఎలాంటి విమర్శలు చేయకుండా షర్మిల తన సొంత సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తుండటాన్ని సీనియర్లు తప్పు పడుతున్నారు. ఇలాగయితే పార్టీ ఎప్పటికి బలోపేతం అవుతుందని అంటున్నారు. ఇటీవల వికారాబాద్ లో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాన్ని కూడా హైకమాండ్ రహస్యంగా సేకరించినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.