తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే నాయకత్వం నుంచిస్సష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య వార్ మరింత ముదిరింది. కొలికపూడి పార్టీ పరువును మరింతగా బజారున పడేస్తుండటంతో ఇక యాక్షన్ తీసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ అనేక రకాలుగా ప్రయత్నించిన పార్టీ నాయకత్వం ఇక చర్యలు తీసుకోకపోతే కొలికపూడి ఎఫెక్ట్ రాష్ట్రమంతటా పడే అవకాశాలున్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే కొలికపూడి శ్రీనివాసరావుపై వేటు పడే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా సంకేతాలు ఇచ్చినట్లయింది.
చివరి వార్నింగ్ అయిపోయిందని...
కొలికపూడికి చివరి వార్నింగ్ అయిపోయిందని, ఇకపై ఆయనతో మాట్లాడే అవకాశం లేదని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొలికపూడి తనకు తాను గొప్ప నేతగా ఊహించుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. వ్యక్తి గత ఇమేజ్ తో ఎవరూ గెలవలేరని,పార్టీ వల్లనే గెలుపు సాధ్యమవుతుందని ఆయనకు అర్ధం కావడం లేదని అన్నారు.టీడీపీ అండ లేకుండా పోటీ చేస్తే జీరో అవుతానని తాను చెప్పానని, తప్పయిందని ఒప్పుకుని, ఇకపై హైకమాండ్ చెప్పినట్లే నడుచుకుంటానని చెప్పిన తర్వాత కొలికపూడి సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెట్టారన్నారు. ఇకపై ఆయనతో మాట్లాడేది లేదన్నారు. పల్లా శ్రీనివాసరావు ఆఫ్ ది రికార్డులో మీడియాతో చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ సంచలన ఆరోపణలు...
మరొక వైపు పార్లమెంటు ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని దృష్టిలో MP అంటే 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' కాదన్నారు. M అంటే 'మట్టి', P అంటే 'పేకాట'గా చిన్ని మార్చేశారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. నిన్న తిరువూరు నియోజకవర్గంలో ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాల పంపిణీ విషంయలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన ప్రొటోకాల్ వివాదం చివరకు మళ్లీ రచ్చగా మారింది. కేశినేని చిన్ని వర్గీయులకు, ఎమ్మెల్యే కొలికపూడి వర్గీయుల మధ్య ఆలయంలోనే ఘర్షణకు దారి తీయడంతో అది పార్టీకి కూడా తలనొప్పిగా మారింది. దీనిపై ఇక నాయకత్వం తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని టీడీపీ సోషల్ మీడియాలో కూడా పార్టీ నాయకత్వానికి కార్యకర్తలు మొరపెట్టుకుంటున్నారు. ఇంకా వదిలేస్తే అసలుకే ముప్పు ఏర్పడుతుందన్న అభిప్రాయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు సమాచారం.