Ongole : ఒంగోలులో కూటమి నేతల మధ్య చిచ్చు.. హీటెక్కిన పాలిటిక్స్

ప్రకాశం జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య హాట్ హాట్ కామెంట్స్ మొదలయ్యాయి

Update: 2026-02-28 07:51 GMT

ప్రకాశం జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య హాట్ హాట్ కామెంట్స్ మొదలయ్యాయి. టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా కనిపిస్తుంది. కూటమిలో ఇద్దరూ ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో ఇక్కడ అసలు మిత్రపక్షాలుగా ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనసేనలోకి చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా బాలినేనిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే అదే సమయంలో జనసేనలో చేరినా గతంలో బాలినేని చేసిన అవినీతి, అక్రమాలను బయటకు తీస్తానని దామచర్ల హెచ్చరించారు.

పదవులు రాక...
మరొకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేనలో చేరినా ఆయనకు ఎటువంటి పదవి దక్కలేదు. ప్రభుత్వ పరంగా లభించే పదవి పక్కన పెడితే జనసేనాని కనీసం పార్టీ పదవి కూడా ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల దామచర్ల జనార్థన్ పవన్ కల్యాణ్ ను కలసి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించి వచ్చారు. మరొకవైపు దామచర్ల జనార్థన్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇప్పటికీ రాజకీయ శత్రువుగానే చూస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన తరచూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై కూడా వత్తిడి తెస్తున్నారు. అయితే జనసేనలో ఉండటంతో కొంత షీల్డ్ ను ఏర్పాటు చేసుకున్నారని దామచర్ల వర్గీయులు బాహాటటంగానే చెబుతున్నారు.
బాలినేని హాట్ కామెంట్స్...
తాజాగా మాజీమంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకోసం చంద్రబాబు ఉచితంగా ఇసుకను వరంగా ఇచ్చారని, కాని ప్రస్తుత ఎమ్మెల్యేలు దానిని మాఫియా గా మార్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ ఒంగోలు రాజకీయాల్లో కాక పుట్టించారు. గతంలో తాము నిర్మించిన శ్రీకర విల్లాస్ కు అక్రమ గ్రావెల్స్ తోలారని ఆరోపించారని, అదే నాయకులు ఇప్పుడు ఒంగోలులో ని భ్రమరా రియల్ ఎస్టేట్ వెంచర్ కు గ్రావెల్ ఎక్కడనుండి తోలుతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. దీంతో ఒంగోలులో టీడీపీ, జనసేనల మధ్య ఇసుక దుమారం చెలరేగిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల కూడా ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.


Tags:    

Similar News