JanaSena : అరవ శ్రీధర్ వ్యవహారానికి ఎండ్ కార్డు పడిందటగా?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఇంత వరకూ పవన్ కల్యాణ్ కు నివేదిక అందించలేదు.
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఇంత వరకూ పవన్ కల్యాణ్ కు నివేదిక అందించలేదు. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్రిసభ్య కమిటీని నియమించారు. అయితే నెల రోజులు అవుతున్నా ఇంత వరకూ కనీసం ప్రాధమిక నివేదికను కూడా పవన్ కల్యాణ్ కు ఇవ్వకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇక అరవ శ్రీధర్ వ్యహారాన్ని మర్చి పోవాల్సిందేనా? అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అరవ శ్రీధర్ ఒక వివాహిత విషయంలో చేసిన అనేక కాల్స్, వీడియోలు బయటకు రావడంతో పార్టీకి రాజకీయంగా కొంత నష్టం జరిగింది. వెంటనే పవన్ కల్యాణ్ దీనిపై వెంటనే తనకు నివేదిక అందించాలని త్రిసభ్య కమిటీని కూడా నియమించారు.
త్రిసభ్య కమిటీని నియమించి....
రైల్వే కోడూరు వెళ్లిన త్రిసభ్య కమిటీ చాలా మందిని విచారించింది. అరవ శ్రీధర్ తో పాటు అనేక మంది పార్టీ నేతలను కూడా విచారణ చేసింది. అయితే ఇందులో తప్పెవరిది అన్న దానిపై నివేదికను పవన్ కల్యాణ్ కు అందించారా? లేదా? అన్నది కూడా తెలయరాలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే నివేదికలో ఏముందన్నది కూడా బయటకు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకూ అరవ శ్రీధర్ పై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో పవన్ కల్యాణ్ కు నివేదిక ఇవ్వలేదని మాత్రం పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కావాలనే నివేదిక అధినేతకు అందివ్వడం లేదా? లేక మరేదైనా కారణాలున్నాయా? అన్నది కూడా తెలియరాలేదు. దీంతో అరవ శ్రీధర్ వ్యవహారం ఇక ముగిసినట్లేనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
పోలీసు కేసు నమోదయినా...
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పోలీసు కేసు కూడా నమోదయింది. ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. మరొకవైపు అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిందని ఆరోపణలు కూడా వినిపించాయి. అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. కానీ నిజంగా అరవ శ్రీధర్ ఆ మహిళను మోసం చేశారా? లేక అరవ శ్రీధర్ ట్రాప్ లో చిక్కుకున్నాడా? లేక మరేదైనా కుట్ర ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై జరిగిందా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ నివేదిక బయటకు రాకపోవడం, చర్యలు లేకపోవడంతో ఇక అరవ శ్రీధర్ వ్యవహారానికి పార్టీ ఎండ్ కార్డు పెట్టేసిందన్న వ్యాఖ్యలకు జనసేన నేతలు ఏ మేరకు స్పందిస్తారన్నది చూడాలి.