Telangana : వేటు తప్పదట.. ఉప ఎన్నిక ఖాయమట

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది

Update: 2026-03-07 12:32 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజుతో అనర్హత ఎమ్మెల్యేల పిటీషన్లపై విచారణ ముగిసింది. మొత్తం పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మారినట్లు బీఆర్ఎస్ వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇప్పటి వరకూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు. ఇక కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలోనే తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే కడియం శ్రీహరి విషయంలో ఏమో గాని దానం నాగేందర్ పై మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఖచ్చితంగా అదే...
దానం నాగేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సిద్ధమయినట్లే సమాచారం. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున దానం నాగేందర్ విషయంలో అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. సాంకేతికంగా ఆధారాలుండటం వల్లనే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా నిలిచారు. అయితే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కండువాలు కప్పుకున్నప్పటికీ వారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మాత్రం ఇవ్వలేదు. దానం నాగేందర్ విషయం మాత్రం డిఫరెంట్.
సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికలలో...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచి 2024 లోజరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్ సాంకేతికంగా కాంగ్రెస్ లో చేరినట్లేనని న్యాయనిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే తొలి నుంచి దానం నాగేందర్ ఒక్కరిపై వేటు పడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. మరొకవైపు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఖైరతాబాద్ కు కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే అనర్హత వేటుపడినా ఆరునెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News