Pawan - Chandrababu : లడ్డూ.. ఒడ్డున పడేస్తుందనుకుంటే.. ఇలా అయిపోతుందేమిటబ్బా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. హోలీ రోజున ఈ ఇద్దరు లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలపై అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. కేవలం నామినేటెడ్ పోస్టులు, పాలనాపరమైన విషయాలపై చర్చించడానికి ఈ భేటీ జరిగిందని ఎవరూ అనుకోవడం లేదు. బలమైన కారణం ఉంటుందనే భావిస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా లడ్డూను పొడిగించి దానిని తెగే వరకూ టీడీపీ నాయకత్వమే లాగుతున్నారని సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యతిరేకత రాకముందే...
దీనికి తోడు తాజాగా తిరుమలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో నెట్టింట్ కనిపించడం, దానిపై ఎవరూ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అది కూడా తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుందని తెలిసింది. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారని, ప్రజల్లోకి మాత్రం కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న అభిప్రాయం కూడా నేతల్లో కలుగుతుంది. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా దీనికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలి? ఎండ్ కు ఎలా తీసుకెళ్లాలన్న దానిపైనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య చర్చ జరిగే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు.
వేగంగా జనంలోకి వెళ్లే...
కూటమిలోని టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయాలు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు తాజాగా మరొక దేవస్థానం కమిటీ ఛైర్మన్ పై కూడా ఆరోపణలు చేయడం పార్టీ ప్రతిష్ట మంటగలుస్తుందని, ఇటువంటి విషయాలు ప్రజల్లోకి వేగంగా, తొందరగా చొచ్చుకు వెళతాయని అందుకే దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై పవన్, చంద్రబాబు నాయుడులు చర్చించినట్లు సమాచారం. అయితే యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? తీసుకోకుండా దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చ నడిచినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమిలో బీజేపీ నేతల జోలికి వెళ్లే ధైర్యం లేక, జనసేన, టీడీపీ నేతలనే వైసీపీ లక్ష్యంగా చేసుకుందన్న అభిప్రాయం కూడా ఈ భేటీలో వ్యక్తమయినట్లు తెలిసింది.